చెట్లలో ప్రముఖంగా చెప్పబడేది రావి. ఇది దేవతల వృక్షంగా భావిస్తారు. రావి చెట్టుకు నిత్యం ప్రదక్షిణలు చేస్తే సకల రోగాలు పోతాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. అందుకే రావి చెట్టుకు అంతటి విలువ.
రావి చెట్టు మూలంలో విష్ణువు, కాండంలో కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో సకల దేవతలు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి నిత్యం నీరు అందించి తాకుతుంటే మన రోగాలు దూరమవుతాయని తెలుస్తోంది.
మనకు మంచి చేసే చెట్లలో మర్రి కూడా ఒకటి. దీన్ని వట వృక్షం అంటారు. వటసావిత్రి పండుగ ఈ చెట్టు దగ్గరే జరుపుకుంటారు. మర్రిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుంటారని ప్రతీతి.
మర్రిచెట్టును చూస్తే సాక్షాత్తు పరమశివుడిని చూసినట్లే. మర్రిచెట్టుకు పూజ చేస్తే మహిళల భర్తలు దీర్ఘాయువుతో జీవిస్తారని వారి నమ్మకం. అందుకే మర్రికి కూడా ఈ మాసంలో పూజలు చేయడం సహజమే.
ఇక మరో చెట్టు ఉసిరి. ఇది శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఉంటూ వంట చేసుకుని భోజనాలు చేయడం సర్వత్రా మంచిదనే అభిప్రాయం ఉంది. అందుకే ఉసిరిని కూడా దేవతా వృక్షంగా పూజిస్తారు.
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బిల్వ వృక్షం. ఈ ఆకులంటే శివుడికి మహాఇష్టం. ఈ ఆకులు లేనిదే శివుడి పూజ చేయరు. అంతటి విలువ కలిగిన చెట్టును శ్రావణమాసంలో పూజిస్తే సకల భాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.
మారేడు దళం అంటే శివుడికి ఎంతో ఇష్టం కావడంతోనే ఈ ఆకులతో పూజ చేస్తే మనకు ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతుంటారు.
మరో వృక్షం వేప. వేపను పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. దారిద్ర్యం దూరమవుతుంది. రోగాలు పోతాయి. శాంతి కలుగుతుంది. అందుకే వేపను శ్రావణమాసంలో విధిగా పూజిస్తారు.