Indiramma Canteens Hyderabad: రాజధాని నగరంలో ఉపాధి దొరుకుతుందని.. ఉద్యోగాలు లభిస్తాయని.. డబ్బు సంపాదించవచ్చు అని చాలామంది అనుకుంటారు. అందువల్లే ఉన్న ఊరిని, కన్నతల్లిని వదిలేసి రాజధాని నగరానికి చేరుకుంటారు. రాజధాని నగరం అనేది ఊరు లాంటిది కాదు.. నలుదిక్కుల్లోనూ విస్తరించి ఉన్న కాంక్రీట్ జంగిల్.. అలాంటి ఏరియాలో బతకడం అంత సులువైన విషయం కాదు. ఉపాధి దొరికే వరకు ఆకలితో పోరాటం చేస్తూ ఉండాలి. ఉద్యోగం లభించే వరకు కడుపున ఒకంట కనిపెట్టుకునే ఉండాలి. అయితే ఇలాంటి వ్యక్తులకు ఆసరాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.
Also Read: లాక్ డౌన్ః అభాగ్యుల కోసం ఈ నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నప్పుడు అమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అమ్మ క్యాంటీన్ లలో తక్కువ రుసుము తీసుకొని ఇడ్లీ, పొంగల్ వంటి అల్పాహారాలను వడ్డించేవారు.. ఇక మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇందులో నామమాత్ర రుసుముకు అల్పాహారం, భోజనం పెడుతుంటారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ హైదరాబాద్ లాంటి నగరాలలో అన్నపూర్ణ పేరుతో ఐదు రూపాయల భోజనం కేంద్రాలు కొనసాగుతున్నాయి. రాజధాని నగరానికి జనం భారీగా వస్తూ ఉండడం.. ఇందులో పేదలు ఆకలితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
రాజధానికి వచ్చేవారికి ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం అందించేందుకు ప్రభుత్వం ఏకంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఐదు రూపాయల భోజన కేంద్రాలను ప్రభుత్వం తొలగించనుంది. పది కోట్ల 70 లక్షల ఖర్చుతో కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని 3 నెలల్లో ప్రభుత్వం ప్రారంభించనుంది.. 2013లో తెలంగాణ రాష్ట్రంలో ఐదు రూపాయల భోజన కేంద్రాలు మొదలయ్యాయి. ప్రస్తుతం 138 కేంద్రాలు హైదరాబాద్ నగరంలో సేవలందిస్తున్నాయి. ప్రతిరోజు దాదాపు 30 వేల మంది దాకా భోజనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటి నిర్వహణను హరే కృష్ణ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఒక ప్లేటు భోజనానికి హరికృష్ణ సంస్థ 33 రూపాయిలు వసూలు చేస్తోంది. ఇందులో ఐదు రూపాయలు ప్రజల నుంచి.. 28 రూపాయలు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నుంచి వసూలు చేస్తోంది.
Also Read: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. వచ్చే వారంలో ఖాతాల్లోకి రూ.6వేలు?
అల్పాహారానికి ప్రజల నుంచి ఐదు రూపాయలు వసూలు చేయనుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నుంచి 14 రూపాయలు స్వీకరించనుంది. అయితే అల్పాహారాన్ని పూర్తిగా తృణ ధాన్యాలతో తయారు చేస్తామని హరేకృష్ణ సంస్థ చెబుతోంది. ” ప్రభుత్వం అల్పాహారాన్ని, వేడివేడి భోజనాన్ని హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి సంకల్పించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. 138 కేంద్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని” హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ కర్ణన్ వెల్లడించారు.