https://oktelugu.com/

Zomato Veg Fleet: తిండికి కులం, మతం ఏంట్రా నాయనా.. ఇది ఫక్తు వ్యాపారమైతే..

స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిదీ ఆన్లైన్ లోనే జరిగిపోతుంది. చివరికి తినే తిండి కూడా. కేవలం ఆన్ లైన్ లో ఫుడ్ సప్లై మీదనే జొమాటో కోట్లను ఆర్జిస్తోంది. అలాంటి సంస్థ ప్రస్తుతం జొమాటో వెజ్ పేరిట వెజ్ ప్లీట్ ను మొదలుపెట్టింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 20, 2024 / 01:22 PM IST

    Zomato Veg Fleet

    Follow us on

    Zomato Veg Fleet: ఏ వ్యాపార సంస్థైనా లాభాల కోసమే వ్యాపారం చేస్తుంది. ఫర్ సప్పోజ్ టాటా ఉప్పు ప్రకటన చివరలో.. “ఈ దేశపు ఉప్పు అని” వినిపిస్తుంది. అంటే దేశానికి, వ్యాపారానికి ముడిపెట్టారన్నమాట. పతంజలి ఉంది.. దాని ఉత్పత్తులు మొత్తం ఒక సెక్షన్ వారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే అది దాని మార్కెటింగ్ స్ట్రాటజీ. ఆన్ లైన్ లో ఫుడ్ సప్లై చేసే జొమాటో కూడా మార్కెట్ లో తన స్థానాన్ని పెంచుకోవడానికి.. గుత్తాధిపత్యాన్ని చలాయించడానికి వెజ్ అనే అస్త్రాన్ని వదిలింది. ఇక అప్పుడు మొదలైంది.. తిండికి కులం ఆపాదిస్తున్నారని, మతాన్ని కట్టబెడుతున్నారని.. ఒక సెక్షన్ మండిపడడం షురూ అయింది. జొమాటో కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు.. కామెంట్లు.. అబ్బో మామూలుగా లేదు యవారం.

    తిండి అనేది ఎవరిష్టం వారిది. ఉదాహరణకి మార్వాడీలు కేవలం వెజ్ మాత్రమే తింటారు. ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎంత దూరమైనా సరే వెజ్ రెస్టారెంట్ కే వెళ్తారు. పొరపాటున నాన్ వెజ్ ముట్టుకోరు. అంతటి సుధా మూర్తి కూడా ప్యూర్ వెజ్. ఆమె కనీసం వెల్లుల్లి, ఉల్లి వంటివి కూడా ముట్టుకోరు. ఎక్కడికైనా వెళ్తే రెడీ టు ఈట్ ప్యాకెట్లను తీసుకెళ్తారు. అప్పటికప్పుడు వేడి నీళ్లలో మరిగించి అందులో ఈ ప్యాకెట్లలోని పదార్థాన్ని వేసి.. ఆ వంటకాలను తయారు చేసుకుని తింటారు. అప్పట్లో ఏదో షోలో తన తిండి గురించి మాట్లాడిన సుధా మూర్తి పై ఒక సెక్షన్ ప్రజలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. తినేది ఆమె. వండుకునేది ఆమె.. మధ్యలో ఒక సెక్షన్ వారికి అభ్యంతరాలు ఎందుకు? సుధా మూర్తికి అనుకూలంగా మరికొందరు వాదించారు. సుధా మూర్తి మాత్రమే కాదు.. సంప్రదాయాన్ని పాటించే జైనులు కూడా అంతే.. తిండి విషయంలో వారు తగ్గరు. తమ సాంప్రదాయాలను కలపడానికి ఇష్టపడరు. కేవలం పూర్తి శాకాహార వంటలు మాత్రమే తింటారు. పొరపాటున కూడా పాల ఉత్పత్తులను దగ్గరికి రానివ్వరు. ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్, ఇంకా కొన్ని దుంపలను మర్చిపోయి కూడా తినరు. అంటే తిండి విషయంలో కొందరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని మనం గౌరవించాల్సి ఉంటుంది.

    స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిదీ ఆన్లైన్ లోనే జరిగిపోతుంది. చివరికి తినే తిండి కూడా. కేవలం ఆన్ లైన్ లో ఫుడ్ సప్లై మీదనే జొమాటో కోట్లను ఆర్జిస్తోంది. అలాంటి సంస్థ ప్రస్తుతం జొమాటో వెజ్ పేరిట వెజ్ ప్లీట్ ను మొదలుపెట్టింది. వెజ్ అనేదానికి సింబాలిగ్గా ప్యూర్ గ్రీన్ కలర్ లోనే ఫుడ్ బాక్స్, సర్వీస్ బాయ్ లకు గ్రీన్ టీ షర్ట్ ను డ్రెస్ కోడ్ గా నిర్ణయించింది. ఆల్రెడీ సర్వీసులు కూడా మొదలయ్యాయి. ఇది ప్యూర్ వెజ్ కాబట్టి.. కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే సప్లై చేస్తారు. అది కూడా వెజ్ రెస్టారెంట్ల నుంచి మాత్రమే తీసుకొస్తారు. ఎప్పుడైతే జొమాటో ఇలా మొదలు పెట్టిందో విమర్శలు మొదలయ్యాయి. మళ్లీ పాత యుగాల వైపు జొమాటో మనల్ని తీసుకుపోతోంది.. కులం పేరుతో, మతం పేరుతో తిండిని విభజిస్తోంది.. అంటూ విమర్శలు తాకిడి ఎక్కడెక్కడికో వెళ్తోంది. స్థూలంగా చెప్పాలంటే జొమాటో అనేది ఒక వ్యాపార సంస్థ. అది కేవలం వ్యాపారం మాత్రమే చేస్తుంది. మార్కెట్లో ఇతర వాటికంటే భిన్నంగా ఉండాలంటే అది భిన్నమైన ఆలోచన చేసింది. స్విగ్గిని తొక్కాలంటే, ఉబర్ ను పక్కకు నెట్టాలంటే జొమాటో కు కొత్త ప్రయోగం అవసరం. అలాంటిదే చేసింది. ఒకవేళ అది విజయవంతం కాకపోతే మూసేస్తుంది. అంతేతప్ప సుధా మూర్తి వంటి శాకాహారుల కోసం సేవలు చేయదు. అంతిమంగా జొమాటోకు డబ్బులు కావాలి. జొమాటో భాషలో చెప్పాలంటే వారికి తిండి ఒక వ్యాపారం. అంతే అంతకుమించి ఏమీ లేదు.