Minister Roja: అందితే జుట్టు.. లేకపోతే కాలు అన్నట్టుంది ఏపీ మంత్రి రోజా వ్యవహార శైలి. నిన్నటి వరకూ చంద్రుడు, ఇంద్రుడు అంటూ ఇంటికెళ్లి ఆశీర్వాదం పొందిన వారినే ఇప్పుడు టార్గెట్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ లక్ష్యంగా ఆమె చేస్తున్న కామెంట్స్ పై విమర్శలు రేగుతున్నాయి.సొంత పార్టీలోనే సెగలు పుట్టిస్తున్నాయి. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు రోజా కొత్తవి తెచ్చిపెడుతున్నారని సొంత పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. మధ్యలో చిరంజీవి ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్, చిరంజీవి మధ్య రాజకీయాలకతీతంగా బాండింగ్ ఉంది. వైసీపీ ఎప్పుడూ చిరంజీవి పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. అటు చిరంజీవి సైతం తన తమ్ముడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నా.. వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్నా ఆ కోణంలో ఎప్పుడూ చూడలేదు. అటు జగన్ తో పాటు వైసీపీ నేతలు ఒక వ్యూహం ప్రకారం చిరంజీవితో బంధాన్ని కొనసాగిస్తున్నారు. దానిని చెడగొట్టేలా చిరంజీవి రాజకీయ ఓటములు గురించి రోజా ఎద్దేవా చేస్తుండడం సొంత పార్టీ శ్రేణులకు కూడా రుచించడం లేదు.

గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్ చిరంజీవికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రత్యేక బంధం కొనసాగిస్తున్నారు. చిరంజీవిని సినీ పరిశ్రమ పెద్దగా భావిస్తూ వచ్చారు. చిత్ర పరిశ్రమ సమస్యలు విన్నవించే చాన్స్ కూడా ఇచ్చారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలో చొరవ తీసుకొని మరీ చిరంజీవి జగన్ వద్ద పంచాయితీ పెట్టారు. అదే సమయంలో పవన్ మాత్రం జగన్ కు రాజకీయ శత్రువుగా మారిపోయారు. ఈ క్రమంలో చిరంజీవి జగన్ కు చేతులు జోడించి అర్ధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సీఎం జగన్ కు ఏ స్థాయి వ్యక్తులైనా చేతులు జోడించాలా అంటూ పవన్ తీవ్ర స్థాయిలో రియాక్టయ్యారు. ఈ దశలోనే చిరంజీవి వైసీపీ తరుపున రాజ్యసభకు నామినేట్ అవుతున్నారని ప్రచారం సాగింది. వైసీపీ, జనసేనల మధ్య పొలిటికల్ కామెంట్స్ నేపథ్యంలో చిరంజీవిని చూసైనా పవన్ నేర్చుకోవాలంటూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కేవలం పవన్ ను ఆత్మరక్షణలో పడేసేందుకు చిరంజీవితో బంధాన్ని కొనసాగిస్తూవచ్చారు.
మంత్ర రోజా ఇప్పుడు మెగా బ్రదర్స్ గురించి కామెంట్స్ చేశారు. అది గెలుపోటముల గురించి మాట్లాడేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పాలకొల్లు నుంచి గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. అటు పవన్ జనసేన స్థాపించి భీమవరం నుంచి గెలవలేకపోయారని గేలి చేశారు. ఇప్పుడిదే పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. రోజా మంత్రి అయ్యాక చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందారు. అటు తరువాత పవన్ ను ఇరుకున పెట్టేందుకు చాలాసార్లు చిరంజీవి గొప్పదనాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు మెగా ఇద్దరి బ్రదర్స్ తో కలిపి చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం చేటు తెస్తుందని.. పవన్ ను ఆత్మరక్షణలో పడేసే వ్యూహాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నామని వైసీపీ శ్రేణులు బాధపడుతున్నాయి. మంత్రి రోజా తీరును తప్పుపడుతున్నాయి.

అటు కేసీఆర్ విషయంలో కూడా రోజా నోరుజారారు. ఏపీలో బీఆర్ఎస్ ఎలా అడుగుపెడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఏపీ ప్రజలు నమ్మరన్నారు. గతంలో ఇదే మంత్రి రోజా హైదరాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భాలున్నాయి. తనకు కేసీఆర్ తండ్రి సమానులని చెప్పుకున్నారు. తమిళనాడు పర్యటనకు వెళుతున్న కేసీఆర్ నగిరిలోని రోజా నివాసంలో భోజనం కూడా చేశారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక రోజా కేసీఆర్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడదే కేసీఆర్ పై విమర్శలకు దిగడంతో రోజా తీరుపై చర్చ జరుగుతోంది. ఆమె రాజకీయంగా చేస్తున్న విమర్శలు విశ్లేషణలకు కారణమవుతున్నాయి. అటు వైసీపీ శ్రేణులు సైతం ఆమె తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.