Amit Shah- YCP: ఏపీలో బీజేపీ రాజకీయ వ్యూహం మొదలుపెట్టనుందా? ఇన్నాళ్లూ జగన్ విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన కేంద్ర పెద్దలు కన్నెర్రజేయనున్నారా? రాజకీయ స్ట్రాటజీ మార్చనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నపరిణామాలు అనుమానాలం బలం చేకూరుస్తున్నాయి. ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. గత ఎన్నికల తరువాత ఆయన రాజకీయ పర్యటనలు చేయలేదు. తెలంగాణలో బీజేపీ కేంద్ర పెద్దల పర్యటనలు నిత్యం ఉంటున్నాయి. అక్కడ అధికార టీఆర్ఎస్ తో గట్టిగానే పోరాడుతుండడం ఇందుకు కారణం. అయితే ఏపీలోమాత్రం జగన్ సర్కారుపై కేంద్ర పెద్దలు కొంత సానుకూలతతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఏపీలో తెలంగాణ స్థాయిలో జగన్ సర్కారుపై మాటలు, విమర్శల దాడి లేదు. పెద్దగా తెలియని కేంద్ర మంత్రులు అప్పుడప్పుడు ఏపీ వచ్చి వెళుతున్నారు. కానీ పెద్దగా ఫోకస్ కావడం లేదు. అందుకే ఇప్పుడు నేరుగా అమిత్ షా వస్తుండడంతో పరిస్థితి మారుతుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

జనవరి 9న అమిత్ షా ఏపీలో పర్యటించనున్నారు. పర్యటన తేదీ ఖరారు చేశారు. హిందూపురం, కర్నూలు లోక్ సభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల తరువాత అమిత్ షా రాష్ట్రానికి వచ్చినా అవి రాజకీయ పర్యటనలు కావు. కేవలం అధికారిక పర్యటనలకు వచ్చి వెళ్లేవారు. కేంద్ర మంత్రులు ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధి గురించి చెప్పనున్నారు. బీజేపీయేతర రాష్ట్రాలు, అధికారంలోకి రావాలనుకున్న ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఇదో వేదికగా భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో నేరుగా అమిత్ షా రంగంలోకి దిగడంతో వైసీపీతో బంధం కొనసాగిస్తారా? లేకుంటే తెంపుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

అయితే ప్రధాని మోదీ విశాఖ పర్యటనను వైసీపీ హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తే వైసీపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రైల్వేజోన్, భోగాపురం ఎయిర్ పోర్టు, గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు వస్తున్నారంటూ సందడి చేశారు. బీజేపీ నేతలకు కాదని.. అది సొంత పార్టీ వ్యవహారంగా ట్రీట్ చేశారు. ఇప్పుడు అమిత్ షా పర్యటనను కూడా హైజాక్ చేసే అవకాశం లేకపోలేదని టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పనిలోపనిగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ పై కూడా ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం చాన్స్ ఇవ్వమని చెబుతున్నారు.