
Chandrabose On Oscar Stage: ఆస్కార్ గెలవడం, ప్రపంచ సినిమా వేదికపై దాన్ని ముద్దాడటం వర్ణించలేని అనుభూతి. ఇక ఆస్కార్ విజేతలు తమ ఆనందాన్ని మాటల్లో తెలియజేస్తారు. ఆస్కార్ స్పీచ్ కి ప్రత్యేకత ఉంది. ఒక వేళ మనకు అవార్డు వస్తే ఏం మాట్లాడాలనేది ముందుగానే మనసులో అనుకుంటారు. కొంత ప్రిపేర్ అవుతారు. కొందరైతే ఎమోషన్ లో అప్పటికప్పుడు మనసులో తట్టిన భావాలు పంచుకుంటారు. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకుంది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది.
నాటు నాటు సాంగ్ స్వరపరిచిన కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్ ఆస్కార్ వేదికపైకి వెళ్లి అవార్డులు అందుకున్నారు. కీరవాణి మాత్రమే అక్కడ మాట్లాడారు. రాజమౌళి, కార్తికేయలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన కీరవాణి తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రిచర్డ్ కార్పెంటర్ ని తలచుకున్నారు. కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగాను. నేడు ఆస్కార్ అందుకునే స్థాయికి వచ్చానన్నారు. హాలీవుడ్ మ్యుజీషియన్ కార్పెంటర్ తనకు స్ఫూర్తి అని చెప్పకనే చెప్పారు. టాప్ ఆఫ్ ది వరల్డ్ సాంగ్ ట్యూన్ లో తన ఆనందం షేర్ చేశారు.
అయితే చంద్రబోస్ మాట్లాడలేదు. కీరవాణి మాట్లాడుతుండగా ఆయన అభివాదం చేస్తూ నిలుచున్నారు. చివర్లో మాత్రం తెలుగు పదం ‘నమస్తే’ అని పలికి వెళ్లిపోయారు. చంద్రబోస్ ఎందుకు మాట్లాడలేదనే చర్చ జరుగుతుండగా… అనేక వాదనలు తెరపైకి వస్తున్నాయి. కొందరేమో ఆయనకు ఇంగ్లీష్ రాదని, అందుకే మౌనంగా ఉండిపోయారంటున్నారు. కాగా ఆయనకు ఇంగ్లీష్ రాకనో, బిడియంతోనో అలా చేయలేదు. ఆస్కార్ నిబంధనల ప్రకారం కేవలం 45 సెకండ్స్ లో స్పీచ్ ముగించాలి.

ఒక విభాగంలో పలువురు అవార్డ్స్ గెలుచుకున్నా ఒక్కరే మాట్లాడాలి. తమ స్పీచ్ 45 సెకండ్స్ లో ముగించాలి. దీన్ని అవార్డు ఆక్స్ప్టెన్సీ స్పీచ్ అంటారు. 1943లో నటి గ్రీర్ గార్సన్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్నారు. ఆమె ఏకంగా ఏడు నిమిషాలు మాట్లాడారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధన తెచ్చారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు గెలుచుకోగా… డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్, ప్రొడ్యూసర్ గునీత్ మోంగా వేదికపైకి వెళ్లారు. కార్తీకి మాత్రమే మాట్లాడారు. కాబట్టి నిబంధనల్లో భాగంగా ఆస్కార్ వేదికపై చంద్రబోస్ మాట్లాడలేదు.