
Preeti Case: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. ప్రస్తుతం ఆమెకు నిమ్స్ ఆస్పత్రిలో ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు.. అందరితో చలాకీగా ఉండే ప్రీతి ఆత్మహత్యకు ఎందుకు యత్నించింది? ప్రశ్నించే స్వభావం ఉన్న ప్రీతి ఆత్మహత్య చేసుకునే దాకా ఎందుకు వెళ్ళింది? ఈ ఘటనలో సైఫ్ అనే ఓ యువకుడి పేరు ఎందుకు వినిపిస్తోంది? పోలీసులు చెబుతున్నది ఏమిటి? దీనిపై “ఓకే తెలుగు” విశ్లేషణాత్మక కథనం.
కాకతీయ మెడికల్ కాలేజీలో..
డాక్టర్ ప్రీతి, డాక్టర్ సైఫ్ వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో డాక్టర్ సైఫ్ సీనియర్.. డాక్టర్ ప్రీతి జూనియర్. వీరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది.. అయితే కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్లను జూనియర్లు “సార్” అని సంబోధించాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. అయితే ప్రీతి సీనియర్లను “సార్” అని ఎందుకు పిలవాలని నిలదీసింది.. ఇది నచ్చని సీనియర్లు ఆమెను టార్గెట్ చేశారు. ముఖ్యంగా సైఫ్ ఆమెను వేధించినట్టు వాట్సప్ చాట్ ద్వారా తెలుస్తోంది. అంతే కాదు ఆమెను అవమానించేలా వాట్సప్ గ్రూప్ లో పోస్టులు పెట్టాడని, అలా పెట్టవద్దని ప్రీతి వేడుకున్నదని తెలుస్తోంది. ఒకానొక సందర్భంలో సైఫ్ ఆమెకు మెదడు లేదని దూషించాడు.. “ఫిబ్రవరి 20వ తేదీన సైఫ్ వేధిస్తున్న తీరు గురించి ప్రీతి తల్లిదండ్రులకు చెప్పింది. 21వ తేదీన కాలేజీ యాజమాన్యం ప్రీతి, సైఫ్ ను విచారించింది. మంగళవారం తెల్లవారుజామున ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రీతి ప్రశ్నిచడాన్ని సైఫ్ సహించలేకపోయాడు. వాట్సప్ గ్రూపుల్లో అవమానకరంగా మెసేజ్లు పెట్టి వేధించడం కూడా ర్యాగింగ్ కిందకు వస్తుంది. అంతేకాదు ఆత్మ న్యూనతకు గురైన ప్రీతి పాయిజన్ ఇంజక్షన్ గురించి గూగుల్లో సెర్చ్ చేసింది. అది వేసుకొని ఆత్మహత్యకు యత్నించింది.” అని ఈ కేస్ డీల్ చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చెబుతున్నారు.

ప్రీతికి మొదటి నుంచి ప్రశ్నించే గుణం ఎక్కువ ఉంది. ఆమె డేరింగ్, సెన్సిటివ్ కూడా.. ఆమె ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయేవాడు. ఆమెకు సహకరించవద్దని తన ఫ్రెండ్స్ కు చెప్పేవాడు. సైఫ్ సమస్య గురించి ప్రీతి ఎక్కువగా ఆలోచించేది. అతడు వేధిస్తున్నాడని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ” సైఫ్ తనను వేధిస్తున్నాడని స్నేహితులతో చేసిన చాట్ లో ప్రీతి స్పష్టం చేసింది. సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని, గ్రూప్ లో తనను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నాడని వాపోయింది. తనతో ఏదైనా సమస్య ఉంటే హెచ్ ఓ డి ల దృష్టికి తీసుకురావాలని ప్రీతి తన స్నేహితులతో పేర్కొన్నది.. డిసెంబర్ 6 సహా మూడుసార్లు చిన్న చిన్న సంఘటనలు జరిగాయి.. అయితే అవి ఏమంత పెద్దవి కావని ఇక్కడి వైద్య విద్యార్థులు అంటున్నారు.. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్లను జూనియర్లు సార్ అనాలనే నిబంధన ఎప్పటినుంచో ఉంది. బాసిజం తరహాలో ఈ విధానం ఉందని ప్రీతి భావించింది. ఇదే విషయంపై ఈనెల 18న వాట్సాప్ గ్రూప్ లో ఫ్రెండ్స్ తో చర్చించింది. అంతేకాదు నన్ను ఉద్దేశించి హేళన చేసి మాట్లాడటం సరికాదని సైఫ్ కు ప్రీతి మెసేజ్ పెట్టింది. ఇదే విషయాన్ని ప్రీతి తండ్రి నరేందర్ ఏసిపి, మట్టెవాడ ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు.. అయితే ఈ నెల 21న ప్రిన్సిపాల్ పిలిచి వివరణ అడగడంతో.. తాను ఒక సీనియర్ గా ప్రీతికి సలహాలు ఇస్తున్నానని సైఫ్ చెప్పాడు. కానీ ఆ అమ్మాయినే టార్గెట్ చేసుకున్నాడని సైఫ్ చాట్ ద్వారా తెలిసింది అని” సీపీ రంగనాథ్ చెబుతున్నారు