Tarakaratna- Vijayasai Reddy: ఆయనకు తెలుగుదేశం అంటే అస్సలు పడదు. ఆ పార్టీ నేతల పేరెత్తితే ఒంటి కాలిపై లేస్తారు. చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడతారు. అలాంటి అధికారపార్టీ నేత తెలుగుదేశం నేత పై ప్రశంసలు కురిపించారు. ఆ తెలుగుదేశం నేతకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఆ నేత ఎవరు ? టీడీపీ నేతకు ఎందుకు కృతజ్ఞతలు తెలిపారో స్టోరీలో చదివేయండి.

ఇటీవల అనారోగ్యం బారినపడ్డ నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లి తారకరత్న ఆరోగ్యం గురించి కుటుంబసభ్యుల్ని, డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యం పై కీలక విషయాలు వెల్లడించారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు తారకరత్న మొదడుకు రక్తప్రసరణ ఆగిపోయినందున మెదడులో పైభాగం కొద్దిగా దెబ్బతిందని డాక్టర్లు చెప్పారని విజయసాయిరెడ్డి చెప్పారు. వాపు తగ్గాక కోలుకుంటారని డాక్టర్లు చెప్పినట్టు ఆయన అన్నారు. గుండె చక్కగా పనిచేస్తోందని, రక్తప్రసరణ బాగా జరుగుతోందని తెలిపారు.
తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ దగ్గరుండి అన్ని విషయాలు చూసుకుంటున్నారని చెప్పారు. బాలకృష్ణకు ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విజయసాయిరెడ్డి తారకరత్నను పరామర్శించడం కొందరికి ఆశ్చర్యం కలిగించొచ్చు. తారకరత్న టీడీపీ నేత.. విజయసాయిరెడ్డి వైసీపీ నేత కానీ వీరిద్దరి మధ్య పార్టీలకతీతంగా బంధుత్వం ఉంది. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి. విజయసాయిరెడ్డికి కూతురు వరుస అవుతుంది. విజయసాయిరెడ్డి భార్యకు అలేఖ్యరెడ్డి అక్క కూతురు అవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతాడు.

తారకరత్న భార్యతో విజయసాయిరెడ్డికి ఉన్న బంధుత్వంతోనే.. తారకరత్నను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్యం బాగుందని, త్వరలో తారకరత్న బయటికి వస్తాడని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా మీడియాకు చెప్పారు. నందమూరి కుటుంబసభ్యులు కూడా విజయసాయిరెడ్డి అంత స్పష్టంగా తారకరత్న ఆరోగ్యం గురించి బయటకు చెప్పలేదు. పార్టీలు పక్కనపెట్టి తారకరత్నను పరామర్శించడానికి వచ్చిన విజయసాయిరెడ్డిని టీడీపీ కార్యకర్తలు అభినందిస్తున్నారు.