Corona Batch Studies: చదువు శాలెడు.. బలపాలు దోసెడు.. ఇప్పటి తరానికి ఈ సామెత అచ్చుగుద్దినట్టు సరిపోతుంది.. ఆంగ్లం మోజులో పడి తల్లిదండ్రులు మాతృభాషకు దూరం చేస్తున్నారు.. దీంతో పిల్లలు అటు ఇంగ్లీష్ నేర్చుకోకుండా.. ఇటు తెలుగు లో చదవకుండా ఎటూ కాకుండా పోతున్నారు. కనీసం మన జాతీయ గీతం పాడలేని స్థితిలో ఉన్నారు. జాతీయ నేతలు ఎవరు? స్వాతంత్ర పోరాటం ఎవరితో జరిపారు? తాను నేపథ్యం ఏమిటో చెప్పలేని స్థితిలో ఉన్నారు.. ఇక కోవిడ్ నేపథ్యంలో విద్యాసంస్థలకు నిరాటంకంగా సెలవులు వచ్చాయి.. దీంతో విద్యార్థులపై ఆ కాస్త అజమాయిషి కూడా కరువైంది.. దీంతో పిల్లలకు ఆ కాస్త అక్షర జ్ఞానం కూడా కరువైంది. అప్పటిదాకా నేర్చుకున్నవి కూడా మర్చిపోయారు.. దీంతో వారికి కనీస అంశాలపై ప్రాథమిక అవగాహన కొరవడింది.

ఆ మధ్య కోవిడ్ తర్వాత పాఠశాలలు పున: ప్రారంభం అయినప్పుడు జాతీయ విద్యాశాఖ కమిషన్ అధికారులు దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారు.. పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు.. విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు.. ఇందులో ఏ ఒక్కరు కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోయారు.. కనీసం వర్ణమాల కూడా రాయలేని స్థితికి చేరుకున్నారు.. ఈ క్రమంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.. కానీ వాటిని అమలు చేసే సోయి రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోయింది.

ఇక మొన్న జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనగణమన గేయాన్ని ఆలపించాలని తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని స్థానిక యువకులు అడిగితే… అతడు ఆ గేయాన్ని తన ఇష్టానుసారం పాడాడు.. అంతేకాదు అలా ఎందుకు పాడుతున్నావు అని వారు అడిగితే నా ఇష్టం నేను ఇలానే పాడుతా అని వారిని వారించాడు.. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. చూసేవాళ్ళకు నవ్వు తెప్పిస్తున్నప్పటికీ.. పడిపోతున్న మన విలువలకు, వచ్చే తరం మర్చిపోతున్న విధానాలకు తార్కాణంగా నిలుస్తోంది.