
AP IAS Officers Transfer: ఎన్నికలకు ఏపీ సీఎం జగన్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అన్నివిధాలా అలెర్టు చేస్తున్నారు. వర్క్ షాపుల పేరిట పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశమయ్యారు. ప్రజల మధ్యే ఉండాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు పాలనా యంత్రాంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలకు భారీగానే కసరత్తు చేశారు. అందులో భాగంగా ఏకంగా 57 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎనిమిది మంది వివిధ జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఐపీఎస్ అధికారుల బదిలీల సైతం ఉండే చాన్స్ ఉంది. మొత్తానికైతే ఒకేసారి అధికారుల బదిలీలతో ఎన్నికలకు రెడీ అయినట్టు సంకేతాలు వస్తున్నాయి. కానీ ముందస్తుకు వెళ్లడం లేదని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల నిబంధనలతో…
ఎన్నికల నిబంధనలను అనుసరించి ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. అందుకే జగన్ రెండేళ్లు పనిచేసిన కలెక్టర్లను, ఇతర ఐఏఎస్ లను మార్చడానికి డిసైడ్ అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి అధికారులు కుదరుకుంటారని భావిస్తున్నారు. ఈ ఏడాది పాలనా పరంగా కీలక సమయం కావటంతో అధికారుల నియామకంలో భారీ కసరత్తు తరువాత బదిలీలు చేశారని టాక్ వినిపిస్తోంది. విభాగాధిపతులు, కార్యదర్శుల స్థాయిలో పెద్దగా మార్పులు చేయనట్టు తెలుస్తోంది. అయితే కొన్ని కీలక విభాగాలకు అధికారులను మార్చారు. సీఎం జగన్ అటు రాజకీయంగానూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగటంతో.. ఈ రోజు లేదా రేపు ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎస్పీ స్థాయి నుంచి ఐజీ ర్యాంకు వరకు బదిలీలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిది మంది కలెక్టర్లకు స్థానచలనం..
ఒకేసారి ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేశారు. జిల్లాల ఆవిర్భావ దినోత్సవం మరుసటి రోజునే కలెక్టర్లకు స్థానచలనం కలగడం విశేషం. విజయనగరం కలెక్టర్ ఎ.సూర్యకుమారిని పంచాయతీరాజ్ కమిషనర్‌గా, కర్నూలు కలెక్టర్ పి.కోటేశ్వరరావును పురపాలక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మిని విజయనగరం కలెక్టర్‌గా పంపారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న సృజనను కర్నూలు కలెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను బాపట్ల కలెక్టర్‌గా నియమించారు. గ్రేటర్ విశాఖ కమిషనర్ పి.రాజాబాబును కృష్ణా కలెక్టర్‌గా బదిలీ చేశారు. హైకోర్టు ఆగ్రహానికి గురైన దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్‌ను కార్మిక శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు.
కీలక అధికారులకు సైతం…
కీలక శాఖలకు సంబంధించి విభాగ అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌పీ సిసోడియాను బదిలీ చేశారు. ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల విభాగం డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. చాలారోజులుగా వెయిటింగ్ లో ఉంచి హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. . దేవాదాయ శాఖ కమిషనర్ గా స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీ న ఎస్.సత్యనారాయణను నియమించారు.ఆ పోస్టుతో పాటు శాఖ కార్యదర్శిగా కూడా కొనసాగనున్నారు. కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న జి.అనంతరామును మైనారిటీ సంక్షేమ శాఖకు బదిలీ అయ్యింది. జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీగా ఉన్న బి.శ్రీధర్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నియమించారు. నెల్లూరు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబును జెన్‌కో ఎండీగా బదిలీ చేశారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఎంవీ శేషగిరిబాబును కార్మిక శాఖ కమిషనర్‌గా బదిలీచేశారు. సౌరభ్ గౌర్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు.

ఎన్నికల టీమ్ ఇదేనా?
అయితే ఇంత పెద్దఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జగన్ ముందస్తుకు వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. గత కొద్దిరోజులుగా సీఎం జగన్ చర్యలు, ముందస్తు హడావుడి కనిపించింది. అయితే పార్టీ వర్కుషాపులో దీనిపై జగన్ స్పష్టతనిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులనుద్దేశించి మాట్లాడుతూ ముందస్తుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో దీనికి తెరపడింది. అయితే ఇప్పుడు ఐఏఎస్ ల బదిలీలు జరగడంతో మళ్లీ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అధికారులు మాత్రం ఈ బదిలీలు సర్వసాధరణంగా చెప్పుకుంటున్నారు. కానీ సీఎం జగన్ ఎలక్షన్ టీంతో అస్త్రశాస్త్రాలతో సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది.