
Modi Vs KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 8న శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ప్రధానమంత్రి రానున్నారు. ఆ తర్వాత 11: 35 నిమిషాలకు బేగంపేట నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటల 45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.. సికింద్రాబాద్_ తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు.. అయితే ఈ పర్యటన సందర్భంగా ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ప్రధాని హైదరాబాద్ పర్యటన లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపినట్టు వివరించారు.. గతంలో మోదీ పర్యటించినప్పుడల్లా కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయితే ప్రధాని పర్యటనలో ప్రతిసారి ముఖ్యమంత్రి రాకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముచ్చింతల్ కార్యక్రమం నుంచి మొదలుపెడితే మొన్నటి వరకు.. తెలంగాణకు ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి ముఖం చాటేశారు. అయితే ప్రధానమంత్రికి స్వాగతం పలికే సంప్రదాయాన్ని ముఖ్య మంత్రి విస్మరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దీంతో మరోసారి బి.ఆర్.ఎస్, బిజెపి మధ్య ప్రోటోకాల్ రగడ చోటు చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని పర్యటనలో షెడ్యూల్ ప్రకారం కెసిఆర్ కు కొద్ది సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక శనివారం హైదరాబాద్ లో ప్రధానమంత్రి పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అయితే ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడేందుకు కేవలం ఏడు నిమిషాల పాటు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. 12:30 నుంచి 12 : 37 వరకు ముఖ్యమంత్రి ప్రసంగానికి సమయం కేటాయించినట్లు సమాచారం. అయితే అసలు ప్రధానమంత్రి మోదీ పర్యటనకు కెసిఆర్ హాజరవుతారా? లేదా? అనేది మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.

అయితే గతంలో ప్రధానమంత్రి పర్యటించినప్పుడు ప్రభుత్వ పరంగా స్వాగతం పలికేందుకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి పంపించేవారు. అంతేకాదు దీనిపై తన సొంత మీడియాలో రకరకాల కథనాలు రాయించేవారు. దీనికి తోడు భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ప్రధానమంత్రి పై పోస్టర్లు కూడా వేసేది. ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. మొదట్లో దీన్ని లైట్ తీసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు.. భారత రాష్ట్ర సమితి పోటీగా వాళ్లు కూడా పోస్టర్లు వేశారు.మొన్న
ఉప్పల్ మెట్రో కారిడార్ పనులు పూర్తి కాలేదని భారత రాష్ట్ర సమితి నాయకులు పోస్టర్లు వేశారు. దీనికి కౌంటర్ గా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పోస్టర్లు వేశారు. అయితే ఈ వ్యవహారం కొనసాగుతుండగానే కేంద్ర రవాణా, రోడ్ల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఘాటైన లేఖ రాశారు. అయితే దీనికి కౌంటర్ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీక్ కేసులో బండి సంజయ్ ని ప్రభుత్వం అరెస్టు చేయించింది. మోదీ పర్యటనకు ముందే కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దీనిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తిరిగి ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. అయితే బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఈ సభను విజయవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.