Yashoda OTT Rights: సమంత యశోద చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆలోచింపజేసే కథను దర్శక ద్వయం హరి-హరీష్ ఆసక్తికరంగా మలిచారన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా సమంత సోలోగా సిల్వర్ స్క్రీన్ పై చెడుగుడు ఆడేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో సమంత అల్లాడించారని అంటున్నారు. యశోద రూపంలో సమంత మరో హిట్ ఖాతాలో వేసుకున్నారంటున్నారు. ఓ బేబీ మూవీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో రికార్డు నెలకొల్పింది సమంత. యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు సాధించిన ఏకైక లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓ బేబీ కావడం విశేషం. ఆ రిజల్ట్ రిపీట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

మణిశర్మ బీజీఎం, కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయంటున్నారు. యశోద ట్రైలర్ అంచనాలు పెంచేయగా వాటిని అందుకోవడంలో యశోద మేకర్స్ సక్సెస్ అయ్యారంటున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, రావు రమేష్ వంటి స్టార్ క్యాస్ట్ సినిమాకు ప్లస్ అయ్యారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న యశోద ఏ మేరకు విజయం సాధిస్తుందో వీకెండ్ ముగిసే నాటికి తేలనుంది.
కాగా యశోద ఓటీటీ రైట్స్ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీనికి ఆ సంస్థ చెల్లించిన మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. ఏకంగా రూ. 45 కోట్లకు యశోద డిజిటల్ రైట్స్ ప్రైమ్ కొనుగోలు చేసిందట. యశోద ఐదు భాషల్లో విడుదల చేయగా… అన్ని భాషల డిజిటల్ రైట్స్ ప్రైమ్ ఈ భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారట. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ ధర పలకడం నిజంగా విశేషం. యశోద చిత్ర డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ ప్రైస్ కి అమ్ముడుబోవడానికి సమంత ఇమేజే కారణం. కాగా అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ ఫ్యామిలీ మాన్ 2 సిరీస్లో సమంత నటించిన విషయం తెలిసిందే.

ది ఫ్యామిలీ మాన్ 2 సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు సమంత మయోసైటిస్ తో బాధపడుతూనే యశోద పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసింది. ఇంట్లో చేతికి సెలైన్ పెట్టించుకుని డబ్బింగ్ చెప్పింది. సినిమా ప్రమోషన్స్ కూడా చేసింది. కఠిన పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా ఇంటర్వ్యూలో సమంత పాల్గొన్నారు. అలాగే సమంత ఎలాంటి డూప్ లేకుండా ప్రమాదకర పోరాట సన్నివేశాల్లో పాల్గొనున్నారు. ఇంత కష్టపడిన సమంతకు ప్రేక్షకులు ఎలాంటి విజయం అందిస్తారో చూడాలి. కాగా సమంత తెలుగులో శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు.