
MLC Kavitha E.D: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు.. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచి దీని మూలాలు తవ్వే పనిలో పడ్డారు. అంతేకాదు ఈ కేసులో హైదరాబాద్ మద్యం వ్యాపారి రామచంద్ర పిల్లై ని అరెస్టు చేశారు. అయితే ఇతడి ద్వారానే ఈ కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో కవిత తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
కవిత, అరబిందో ఫార్మా ప్రోమోటర్ శరత్ చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి సౌత్ గ్రూప్ గా ఏర్పడ్డారు. అయితే అంతకుముందు అరుణ్ పిల్లై, బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు ఈ గ్రూపుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే కవిత ఎప్పుడైతే ఇందులో ఎంటర్ అయిందో ఆమె ప్రయోజనాల కోసం అరుణ పిళ్లై స్పిరిట్స్ లో 32.5 మేరకు భాగస్వామ్యాన్ని నమోదు చేసుకున్నారు.. ఇతడితోపాటు ప్రేమ్ రాహుల్ అనే వ్యక్తి కూడా 32.5 వాటాలు కొనుగోలు చేశారు.. ఇక ఇండో స్పిరిట్ అనే సంస్థ కూడా 35% వాటాను ఇందులో కొనుగోలు చేసింది.. అయితే మొదటి నుంచి కూడా సౌత్ గ్రూప్ అధినేతలకు, ఆప్ నేతలకు మధ్య స్పష్టమైన అవగాహన ఉన్నట్టు దర్యాప్తు సంస్థల అధికారులు గుర్తించారు.. అంతేకాదు అరుణ్, ప్రేమ్ రాహుల్ ఇద్దరు కవిత, బాగుంట శ్రీనివాసులు రెడ్డి , రాఘవరెడ్డి తరఫున బినామీలుగా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. అభిషేక్, బుచ్చి బాబుతో కలిసి 30% మద్యం వ్యాపారాన్ని నియంత్రింనట్టు తెలుస్తోంది.. అరుణ్ ఇండో స్పిరిట్స్ లో 3.40 కోట్ల ను అధికారికంగా పెట్టుబడి పెట్టగా.. కవిత ఆదేశాల మేరకు అందులో కోటి తిరిగి ఆయనకి చెల్లించారు. సౌత్ గ్రూప్, ఆప్, విజయ్ నాయర్ కు ముడుపులు ఇచ్చినందుకే ఇండో స్పిరిట్స్ ను పెర్నాడ్ రికార్డ్ లో హోల్ సేలర్ గా నియమించారు.
9 రిటైల్ జోన్లను నియంత్రించిన కార్టెల్ ఏర్పాటులో అరుణ్ కీలక పాత్ర పోషించారు. సౌత్ గ్రూప్ చెల్లించిన ముడుపులను వ్యాపార కార్యకలాపాల పేరుతో తిరిగి పొందేందుకే ఈ కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ ఏర్పాటులో భాగంగా ఆయన పలు సమావేశాలు నిర్వహించారు.. ఈ సమావేశాల్లో అభిషేక్, బుచ్చిబాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, శరత్ చందర్ రెడ్డి పాల్గొన్నారు.. 2021 జూన్ లో సమీర్ మహేంద్రును కలుసుకునేందుకు శరత్ చంద్రారెడ్డికి చెందిన చార్టర్డ్ విమానంలో అభిషేక్, బుచ్చిబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చారు.. 2021 సెప్టెంబర్ లో పెర్నార్డ్ రికార్డ్ ఏర్పాటు చేసిన విందులో మా గుంట శ్రీనివాసులు రెడ్డి, అరుణ్ , బుచ్చిబాబు, శరత్ రెడ్డి పాల్గొన్నారు. ఇండో స్పిరిట్స్ లో పెట్టుబడులు, రిటైల్ జోన్ల గురించి చర్చించారు.

హైదరాబాదులోని ఐటిసి కోహినూర్లో విజయ్ నాయర్, అరుణ్, అభిషేక్, దినేష్ ఆరోరా కలుసుకున్నారు. తర్వాత 31 కోట్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ అయ్యాయి. మొత్తం ఎక్సైజ్ విధానాన్ని ఎల్ వన్ హోల్ సేలర్ కు 12% లాభాలు సమకూర్చేందుకు, ఇందులో 6% ఆప్ కు ముడుపులుగా మళ్ళిచ్చేందుకు రూపొందించారు. ఇక ఢిల్లీలో మద్యం వ్యాపారం ఏటా 4000 కోట్ల వరకు జరిగితే అందులో 3500 కోట్లు ఎల్ హోల్ సేలర్ లకే లభిస్తుందని ఈడీ తెలిపింది. ఇందులో 12% అంటే 420 కోట్లు లాభాలు కాగా, అందులో సగం 210 కోట్లు ఆప్ కు ముడుపులుగా చెల్లించాలని నిర్ణయించారు.. ఆప్ తరపున రంగంలోకి దిగిన విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు ఇచ్చింది. ఆ మడుపులు ఎలా తిరిగి పొందాలనే విషయంపై 2022 ఏప్రిల్ లో అరుణ్ తదితరులు ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో విజయ్ నాయర్ తో సమావేశమయ్యారు. అరుణ్ ఆదేశాల మేరకు ఇండో స్పిరిట్స్ మూడు సంస్థలకు 4.35 కోట్ల మేరకు క్రెడిట్ నోట్లు జారీ చేసింది. తర్వాత దర్యాప్తును దారి మళ్లించేందుకు వాటిని రివర్స్ చేసి పుస్తకాలు నమోదు చేసింది. ఈ కుంభకోణంలో అరుణ్ మొదటి నుంచి భాగస్వామిగా ఉన్నారు. కొత్త ఎక్సైజ్ విధానం ద్వారా లభించే వ్యాపార అవకాశాలను చర్చించేందుకు, వ్యాపార భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు ఆయన విజయ్ నాయర్, సమీర్ మహేంద్రుతో సంబంధాలు పెట్టుకున్నారు. రాష్ట్ర కేబినెట్లో చర్చించక ముందే మంత్రుల బృందం నివేదికలో కొన్ని భాగాలు బుచ్చిబాబు, అరుణ్ వద్ద ఉన్నాయి. మొత్తం ముసాయిదా రూపకల్పనలో అరుణ్ పాత్ర ఉంది. 100 కోట్లు ఆప్ నేతలకు చెల్లించి, 296.2 కోట్లు ఆర్జించారు.. ఆ సొమ్ముతో అరుణ్ స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేశారు.