
Pawan Kalyan -BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీది వింత పరిస్థితి. ఆ పార్టీకి పవన్ సపోర్టు అవసరం. కానీ నోరు తెరిచి అడగడం లేదు. కానీ పవన్ పేరును మాత్రం అన్ని సందర్భాల్లో వినియోగించుకుంటోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అవసరం ఏర్పడింది. మూడు స్థానాలకు టీడీపీ, వైసీపీ అభ్యర్థులతో పాటు బీజేపీ కూడా పోటీ పెట్టింది. అయితే తాము బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ప్రచారం అయితే చేసుకుంటున్నారు. కానీ ఆ మాట పవన్ చేత చెప్పించలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఇగోకు పోయి పవన్ సపోర్టు తీసుకోలేకపోతున్నారు. దీంతో జనసేన సైతం వైసీపీకి వ్యతిరేకంగా ఎవరికి ఓటు వేసినా పర్వాలేదని యువతకు పిలుపునిస్తోంది. పవన్ మాటగా నాదేండ్ల మనోహర్ ఇదే విషయాన్ని ప్రకటించారు. కానీ స్పష్టంగా బీజేపీకి వెయ్యండని మాత్రం చెప్పలేదు.
ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. జనసేనకు యువత, విద్యార్థుల్లో ఫాలోయింగ్ ఉంది. పవన్ ఒక మాట చెబితే బీజేపీకి గుంపగుత్తిగా ఓట్లు పడే చాన్స్ ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కు జనసేన సపోర్టు చేస్తే గెలుపు చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికీ తాను బీజేపీకి మిత్రపక్షంగా చెప్పుకుంటున్న పవన్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నోరు మెదపడం లేదు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో మాత్రమే కలిసి వెళతామని చెబుతున్న బీజేపీ నాయకులు అంతకంటే ముందుగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టాండ్ ను బయటపెట్టలేకపోతున్నారు.

బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ నుంచి జనసేన విరమించుకుంది. నేతల అకాల మరణంతో కుటుంబసభ్యులు బరిలో దిగడంతో ఆనవాయితీని గౌరవించి పోటీచేయడం లేదని చెప్పింది. అయితే బీజేపీ మాత్రం పోటీచేసింది. పవన్ ఫొటో పెట్టుకొని మరీ ప్రచారం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. మద్దతుకుఅవకాశం ఉన్నా పవన్ అడిగేందుకు ఎందుకో సంశయిస్తోంది. అటు పవన్ సైతం లైట్ తీసుకున్నారు. వైసీపీకి తప్పించి నచ్చిన వారికి ఓటు వేయ్యాలన్న కొత్త పల్లవి అందుకున్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు టీడీపీతో కలిసి నడిచేందుకుడిసైడ్ అయ్యారు. బీజేపీని కూడా తమతో రమ్మని అడిగారు. ఈ విషయంలో బీజేపీ, జనసేనల మధ్య గ్యాప్ ఉంది. ఇటువంటి తరుణంలో ఆ రెండు పార్టీల మధ్య ఇగో రాజకీయం నడుస్తోంది. ఇది ఎంతవరకూ వెళుతుందో చూడాల మరీ.