
Kamma: రాజకీయం, సినిమా, విద్య, వైద్యం, మీడియా ,పారిశ్రామికరంగాల్లో రాణించే ఏ వ్యక్తి,, వ్యవస్థను తీసుకున్నా మనకు కనిపించే సామాజికవర్గం ‘కమ్మ’. అయితే ఇంతలా వారు అభివృద్ధి సాధించడానికి ఏళ్ల కిందటే బీజం పడింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్ డేట్ అయ్యే బలమైన వ్యవస్థ వారికి పనిచేసింది. అదే ఆ సామాజికవర్గానికి ప్లస్ అయ్యింది. కష్టంలో ఉన్న తోటి సామాజికవర్గానికి చెందిన వారికి చెయ్యి అందించి పైకిలేపే అలవాటు చేసుకున్న కమ్మ సామాజికవర్గం ఇప్పటికీ అదే ఒరవడిని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తప్పొప్పులకు తావులేదు. మిగతా సామాజికవర్గాల ప్రయోజనాలతో పనిలేదు. తమ సామాజికవర్గ ప్రయోజనాలకు అన్నిరంగాలు కలిసి పనిచేస్తున్నాయి. అందుకే అత్యున్నత వ్యవస్థగా భావించే రాజకీయాల్లో కమ్మలు చెరగని ముద్ర వేయడానికి ప్రధాన కారణం. అయితే వారిలో ఐక్యత ఇప్పటిది కాదు. 1911 మార్చిలోనే కమ్మ సంఘం తరుపు ప్రథమ మహాజన సభ నిర్వహించి…ఇంతటి ఘన కీర్తికి నాడే బీజం వేశారు. ముందుచూపుతో వ్యవహరించి తమ సామాజికవర్గానికి మంచి బాటలు వేశారు
ఏపీ రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గానిది ప్రత్యేక స్థానం. జనభాపరంగా తక్కువగా ఉన్నా రాజకీయంగా మాత్రం యాక్టివ్ రోల్ ప్లే చేశారు. మిగతా ప్రధాన సామాజికవర్గాలకు ధీటుగా ఎదిగారు. ఐక్యతకు మారు పేరు. శతాబ్దాల కిందటే వారు ముందుచూపుతో వ్యవహరించి సంఘాలు, మహాజన సభలతో ఐక్యత చాటారు. రాజకీయ, వ్యవసాయ, పారిశ్రామికరంగాల్లో అభివృద్ధి సాధించారు. తమ సామాజికవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపారు. తొలిసారిగా 1911లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కవుతరంలో కమ్మ ప్రధాన మహాజన సభ నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సామాజిక యాక్టివిటీస్ ను కొనసాగిస్తున్నారు. అన్నిరంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా సైద్ధాంతికంగా వ్యతిరేకించుకుంటున్నా… సామాజికవర్గపరంగా గౌరవించుకునే ఏకైక కులం కమ్మ అని ప్రత్యేక పేరుంది.

అభివృద్ధి చెందిన ప్రాంతాలుంటే అక్కడ కచ్చితంగా కమ్మవారు ఉంటారని ఒక కామెంట్ ఉంది. అందులో కొంత వాస్తవం ఉంది. ఒడిశాలాంటి మారుమూల ప్రాంతాల్లో సైతం కమ్మలు దర్శనమిస్తున్నారు. పారిశ్రామిక, రాజకీయాల్లో రాణిస్తున్నారు. కమ్మలది సుదీర్ఘ చరిత్ర. గుండ్లకమ్మ, పేరికమ్మ (కృష్ణానది) నదుల మధ్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి వలసవచ్చారనీ మరో కథనం చెబుతోంది.
కమ్మవారికి పాలనా అనుభవం ఎక్కువ. శతాబ్దాల కిందటే వారు రాజుల వద్ద వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. పాలన, రాజకీయ వృత్తుల్లో పలు హోదాల్లో పనిచేశారు. అయితే రాజ వంశాలు కనుమరుగైన తరువాత మాత్రం వ్యవసాయ రంగంపై దృష్టిసారించారు. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూమిని రాజుల నుంచి పొందగలిగారు. సరిగ్గా అదే సమయంలో దేశంలో హరిత విప్లవం ఎంట్రీ ఇవ్వడం వీరికి కలిసొచ్చింది. 20వ శతాబ్ది మలిభాగం నుంచి వివిధ వృత్తుల్లోకి ప్రవేశించి విజయం సాధించారు. సినిమా, టూరిజం, వైద్యం, విద్య, పత్రికలు, మీడియా – వంటి అనేక రంగాల్లో కమ్మవారు ప్రవేశించి సక్సెస్ అయ్యారు. సామాజికవర్గ విస్తరణకు కారణమయ్యారు. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, మరోవైపు ఒడిశాలో సైతం ఎంటరయ్యారు.
తొలినాళ్లలో కమ్మ సామాజికవర్గం వారు కమ్యూనిస్టు పార్టీలో కీ రోల్ ప్లే చేశారు. వామపక్ష భావజాలంతో పనిచేశారు. విజయవాడ కేంద్రంగా నడిచే అన్నియాక్టివిటీస్ ను తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. అప్పుడే రెడ్డి సామాజికవర్గానికి ధీటుగా పారిశ్రామికంగా, ఇతరత్రా రంగాల్లో ఎదిగి సవాల్ చేయడం ప్రారంభించారు. అయితే కాలగమనంలో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపనతో దాదాపు కమ్మ సామాజికవర్గం ఆ పార్టీ నీడకు చేరింది. కానీ ఎన్టీఆర్ నుంచి ఆదరణ దక్కని నాయకులు మాత్రం కాంగ్రెస్ లో కొనసాగారు. కానీ ఏ పార్టీలో ఉన్నా వారు సామాజికవర్గపరంగా మాత్రం ఎప్పుడూ వ్యతిరేకించుకోలేదు.
అయితే జనాభాపరంగా కేవలం 6 శాతంగా ఉన్న కమ్మ సామాజికవర్గం సక్సెస్ కావడానికి కారణం వారు అన్నిరంగాల్లో రాణించడమే. సినిమా, మీడియా, వైద్యం, పారిశ్రామికం.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వారే ఎక్కువగా ఉంటారు. కష్టకాలంలో ఐక్యతను చాటుకుంటారు. ఇప్పటికీ కమ్మ సామాజికవర్గ సభలు, సమావేశాలు, వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తుంటారు. సోషల్ యాక్టివిటీస్ ను కొనసాగిస్తుంటారు.సామాజికవర్గంలో వెనుకబాటుతనంపై ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేస్తారు. అయితే మిగతా సామాజికవర్గాల్లో మాత్రం ఆ స్థాయిలో ఐక్యత ఉండదు. ఇప్పుడు కమ్మ ప్రధమ మహాజన సభ 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు.