Calcutta High Court Case: సామూహిక అత్యాచారానికి గురై, గర్భం దాల్చిన ఓ 11 ఏళ్ల బాలికకు దాఖలు పడిన హక్కుల ప్రాధాన్యాన్ని కోల్‌కతా హైకోర్టు చాటిచెప్పింది. బాలిక 25 వారాల గర్భాన్ని తొలగించే విషయంలో కీలక తీర్పు వెలువరించింది. తల్లి, పుట్టబోయే బిడ్డ మానసిక, ఆరోగ్య పరిస్థితులతోపాటు సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకుని.. ఆమె గర్భవిచ్ఛిత్తికి అనుమతించింది. ఇందులో సాధ్యసాధ్యాలను నిర్ధారించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆగస్టు 21లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. వాస్తవానికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం గర్భవిచ్ఛిత్తికి పిండం వయస్సు 24 వారాల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే.. గర్భవిచ్ఛిత్తికి ఆదేశాలిచ్చే అధికారం కోర్టులకే ఉంటుంది.
కోర్టును ఆశ్రయించిన బాధితురాలి తండ్రి..
11 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురై గర్భం దాల్చగా.. 25 నెలల ఆమె పిండాన్ని తొలగించేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తండ్రి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సవ్యసాచి భట్టాచార్యతో కూడిన ఏకసభ్య ధర్మాసనం.. బాలికపై జరిగిన అత్యాచారం ఫలితంగానే ఆమె గర్భం దాల్చిందని గుర్తుచేసింది. ఆమె ప్రసవించడం.. తల్లీబిడ్డకు తీరని మానసిక, శారీరక వేదనను మిగిల్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తే బాధితురాలి హుందాతనం, ఆత్మగౌరవం, ఆరోగ్యకర జీవనం వంటి హక్కులు ఉల్లంఘనకు గురవుతాయని పేర్కొంది. ఈ క్రమంలోనే ఆమెకు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఇవ్వాలని పేర్కొంటూ.. వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తికి అనుమతించింది.
చిన్నారి జీవితం ముఖ్యం..
‘బాధితురాలు వయసు కేవలం 11 ఏళ్లే. తర్వాతి పూటకు భోజనం దొరుకుతుందా? లేదా? కూడా తెలియని పేద కుటుంబం ఆమెది. అత్యాచారం కారణంగా ఆమెకు అయిన మానసిక గాయం పీడకలగా మాత్రమే ఊహించవచ్చు. దాని కారణంగా గర్భం దాల్చిన ఆమె బిడ్డకు జన్మనివ్వడం.. ఇద్దరి జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. జీవితాంతం తీరని మానసిక వేదనను మిగిల్చే అవకాశం ఉంది. పెంపకంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. మాతృత్వం అనేది ఒక వరమే. కానీ, ఈ కేసులో అది అపవాదుగా నిలుస్తుంది. ఇటువంటి చిన్నారి జీవితం వృథా అయ్యేలా.. కోర్టు కళ్లు మూసుకుని కూర్చోదు. ఆమె పిండం వయసు.. చట్టబద్ధమైన 24 వారాలకు ఒక్కవారమే ఎక్కువగా ఉంది. ఇంకా ఆలస్యం కాలేదు. చిన్నారి జీవితం ముఖ్యం. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తే.. బాధితురాలి హక్కులు ఉల్లంఘనకు గురవుతాయి’ అని జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.