Telangana Govt Teachers: ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో దీనిని చాలామంది స్వాగతిస్తున్నాయి. అయితే కొంతమంది బదిలీల షెడ్యూల్ విడుదలవుతున్న వేళ.. ఉద్యమబాట పట్టారు. జీవో 317 సవరించాలని, ఈ జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు బదిలీ అయిన దంపతులు ఒక జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రెండు రోజుల క్రితం విద్యాశాఖ కార్యాయాన్ని ముట్టడించారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. పిల్లలను కూడా ఠాణాలకు తరలించారు. పిల్లలు కూడా తమ అమ్మానాన్నను కలపండి ప్లీజ్ అని వేడుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏంటీ 317 జీవో..
కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 317 జీవో జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సొంత జిల్లాగా ఉన్నవారు జిల్లాల విభజనతో వేర్వేరు జిల్లాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో భార్యభర్తలుగా పనిచేస్తున్నవారు జిల్లాకు ఒకరు అయ్యారు. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం స్పౌజ్ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా బ్లాక్ చేసింది. దీంతో ఉపాధ్యాయ దంపతులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తమ సమస్య పరిష్కరించిన తర్వాతనే బదిలీలు చేయాలని వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతులు కోరుతున్నారు. ఈమేరకే ఆందోళన చేపట్టారు.
టీచర్లపై కేసీఆర్ వివక్ష..
ప్రభుత్వం జీవో 317 ను వెంటనే సవరించాలి.. టీచర్లు కూడా సాటి ఉద్యోగులేనని పోలీసులు గుర్తుంచుకోవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ టీచర్లపై, వారి కుటుంబ సభ్యుల మీద జరిపిన దాడులను, అరెస్ట్‌లను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. టీచర్ల విషయంలో సీఎం కేసీఆర్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జీవో 317తో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని.. ఉద్యోగుల జీవితాలను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. 317 జీవో కారణంగా 34 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు డీఏలు బకాయి..
ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సబంధించిన నాలుగు డీఏలను తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. వేతనాలు కూడా ఒకటో తారీఖున ఇవ్వడం లేదని విమర్శించారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని… బీఆర్‌ఎస్ నేతలు పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. అనుకూలమైన వ్యక్తులు వారికి అనుకూలంగా ఉన్న చోట పోస్టింగ్ ఇస్తున్నారనీ.. అనుకూలం కానివారికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారని విమర్శించారు. జీవో 317పై టీచర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాని డిమాండ్ చేశారు.

13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు బ్లాక్..
తెలంగాణలో ఉద్యోగులు జీతాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కారణం లేకుండా 13 జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలను ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. పాఠశాలల్లో స్కావెంజర్లను తీసేశారని.. టీచర్లు బాత్‌రూమ్‌లు కడగాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నరు. టీచర్ల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కూడా ఉద్యోగులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జీవో 317పై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామని పేర్కొన్నారు.
గతేడాది కూడా జీవో 317పై బండి సంజయ్ పెద్ద ఉద్యమమే చేశారు. ఒక రోజు దీక్షకు యత్నించగా తెలంగాణ ప్రభుత్వం అతడిని అరెస్ట్ చేసింది. కరీంనగర్ పోలీసులు సంజయ్ ఇంటి తలుపులు పలుగగొట్టి అరెస్ట్ చేసిన తీరు అప్పట్లో చర్చనీయాంశమైంది. మరోమారు సంజయ్ జీవో 317పై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్నారు.