Taraka Ratna – Balakrishna : నందమూరి తారకరత్న ఈ లోకాన్ని వీడి దాదాపు నెల రోజులు అవుతుంది. కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్న సుదీర్ఘకాలం మృత్యువుతో పోరాడారు. బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులు ఆయనకు చికిత్స అందించడం జరిగింది. తారకరత్న కోలుకోవాలని, తిరిగి కుటుంబ సభ్యులను, అభిమానులను కలవాలని అందరూ ప్రార్థనలు చేశారు. డాక్టర్స్ ప్రయత్నాలు, అభిమానుల పూజలు ఆయన్ని కాపాడలేకపోయాయి. గుండె, లివర్, కిడ్నీ వంటి ప్రధాన అవయవాలు సాధారణ స్థితికి వచ్చాయి. మెదడులో మాత్రం సమస్య అలానే ఉండి పోయింది.
తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురైన సమయంలో కొన్ని నిమిషాల పాటు గుండె కొట్టుకోలేదు. ఆ కారణంగా మెదడుతో పాటు శరీర భాగాలకు రక్త ప్రసరణ జరగలేదు. మెదడులో కొంత భాగం దెబ్బతినగా, అది రికవరీ కాలేదు. ఇక తారకరత్నను కాపాడుకునేందుకు బాబాయ్ బాలకృష్ణ చేయని ప్రయత్నం లేదు. విదేశీ వైద్యులను పిలిపించారు. బెస్ట్ ట్రీట్మెంట్ తో పాటు యజ్ఞ యాగాదులు చేయించారు. మృత్యుంజయ ఆలయంలో అఖండ దీపం వెలిగించారు.
తారకరత్న ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడు బాలకృష్ణ ఎంతటి వేదన అనుభవించారో అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఎమోషన్స్ మనుషులకు ప్రాణాలు పోస్తాయని నమ్మిన బాలయ్య స్పృహలో లేని తారకరత్న వద్దకు వెళ్లి పాటలు పాడేవారట. జోక్స్ వేయడం, పలకరించడం చేసేవాడట. ఎవరూ చూడని సమయంలో కన్నీరు పెట్టుకున్నారట. బాలకృష్ణ ఒక తల్లిలా తారకరత్న కోసం పాడారంటూ భార్య అలేఖ్య రెడ్డి వెల్లడించారు. అవసరమైన వేళ ఆయన మా వెన్నంటి ఉన్నారని చెప్పుకొచ్చారు.
నందమూరి కుటుంబంలో తారకరత్న-బాలయ్యకు బలమైన అనుబంధం ఉంది. బాలయ్య అంటే తారకరత్నకు ప్రాణం. ఆయన పేరు, సంతకం పచ్చబొట్టుగా వేయించుకున్నారు. తరచుగా ఇద్దరూ కలవడం ఆప్యాయంగా మాట్లాడుకోవడం చేస్తుంటారు. తారకరత్న కెరీర్ సెట్ చేయడం కోసం బాలకృష్ణ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. తన లేటెస్ట్ మూవీ తారకరత్నకు ఓ మంచి పాత్ర రాయమని దర్శకుడు అనిల్ రావిపూడిని కోరాడట. తారకరత్న అనారోగ్యం బారిన పడిన రోజు బాలయ్య అక్కడే ఉన్నాడు. నారాయణ హృదయాల ఆసుపత్రిలో పడిగాపులు పడ్డారు.