Jharkhand Mother: కంటేనే అమ్మ అని అంటే ఎలా అన్నారో సినీకవి. పిల్లల్ని కనకున్నా వారిలో దైవత్వాన్ని చూసే వారు చాలా మంది ఉంటారు. కనకపోయినా పిల్లల్ని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. కన్న ప్రేమ కాకపోయినా పెంచిన ప్రేమకు కూడా ఎంతో ఆదరణ ఉంటుంది. సవతి తల్లి అయినా సరే కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ పిల్లలని చూడకుండా వారిని అకారణంగా చంపాలని భావించే వారు కూడా ఉండటం బాధాకరం. పిల్లల్లో దేవుడుంటారు అంటారు. కానీ వారినే తుదముట్టించే కసాయి తల్లి ఉదంతం విస్తు గొలుపుతోంది.

జార్ఖండ్ లోని సునీల్ సోరేన్ కు నలుగురు పిల్లలు. ఒక కుమార్తె ముగ్గురు కుమారులున్నారు. సజావుగా సాగుతున్న వారి సంసారంలో విధి ఆడిన నాటకంలో వారి జీవితాలు కకావికలం అయ్యాయి. సునీల్ భార్య పాముకాటుతో మరణించడంతో నలుగురు పిల్లలు తల్లిలేని వారయ్యారు. దీంతో వారి ఆలనాపాలన కష్టమైంది. దీంతో శ్రేయోభిలాషుల సూచన మేరకు మరో వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో అతడు సునీత హన్సానీని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె వారిని కన్న తల్లిలా చూసుకుంటుందని అనుకుంటే అలా ప్రవర్తించలేదు.
వారిని సాకడం తన వల్ల కాదని తేల్చిచెప్పింది. దీంతో ఈ విషయంలో తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సునీల్ కు బెంగుళూరులో ఉద్యోగం రావడంతో పిల్లల్ని చూసుకోవాలని చెబితే పట్టించుకోలేదు. దీంతో వారిని నానమ్మ దగ్గర ఉంచి అతడు బెంగుళూరు వెళ్లాడు. ఇటీవల దుర్గా దేవి జాతర ఉండటంతో సొంతూరుకు వచ్చిన సునీల్ తన పిల్లల్ని ఆప్యాయంగా చూసుకున్నాడు. దీంతో ఓర్వలేకపోయిన సునీత ఎలాగైనా పిల్లలను భర్తకు దూరం చేయాలని భావించింది. పిల్లలను సరిగా చూసుకుంటానని సునీల్ ను నమ్మించింది. దీంతో అతడు మళ్లీ బెంగుళూరు వెళ్లిపోయాడు.

ఇక పథకం అమలు చేయాలని ఆలోచించిన సునీత పిల్లలకు చికెన్ లో విషం కలిపింది. వారికి కొసరికొసరి తినిపించింది. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో ఓ కుర్రాడు చనిపోగా విజయ్, శంకర్ అనే పిల్లల పరిస్థితి విషమంగా మారింది. వారు చనిపోయారనుకుని సునీత అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే భర్త సునీల్ ఊరుకు చేరుకుని భార్య మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సునీతను అరెస్టు చేశారు.
పిల్లలకు తల్లి అవుతుందని అనుకుంటే కసాయి తల్లిలా మారి వారిపాలిట యమపాశంలా మారింది. పిల్లలను మంచిగా చూసుకుని ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన వారిని మొగ్గలోనే తుంచాలని ఆశించింది. వారిని కడతేర్చాలని భావించడంతో వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.