
TSRTC: మొన్న సూపర్ లగ్జరీ విభాగంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఇప్పుడు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏపీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రయాణికుల కోసం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఎసి స్లీపర్, సీటర్ కం స్లీపర్ బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ… సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింత చేరువయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది.
ప్రైవేటు బస్సులకు దీటుగా
ప్రైవేటు బస్సులకు దీటుగా 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను ఆర్టీసీ నడపనుంది. నాన్ ఎసి స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సు లకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. బస్సు వెలుపలి భాగంలో అమ్మఒడిలో కూర్చున్న ఒక పాప ఫోటోను రూపొందించింది. అంటే ఈ బస్సులో ప్రయాణించిన వారికి అమ్మ ఒడిలో ఉన్నంత రక్షణ లభిస్తుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.
బస్సును పరిశీలించిన సజ్జనార్
హైదరాబాదులోని బస్సు భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో ( నమూనా) ఏసి స్లీపర్ బస్సును ఆర్టీసీ ఎండి సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి… ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకు వస్తున్న ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సు లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.. ఇప్పటివరకు ఆర్టీసీ కి స్లీపర్ కోచ్ బస్సులు లేవు. దీనివల్ల ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు పండుగల సమయాలను క్యాష్ చేసుకుంటున్నాయి.. ఎప్పటినుంచో స్లీపర్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ భావిస్తుండగా… అది ఇన్నాళ్ళకు కార్యరూపం దాల్చింది..

అధునాతన సౌకర్యాలు
ఇక ఈ బస్సులో అధునాతన సౌకర్యాలు కల్పించారు.. పడుకునేందుకు మెత్తటి కూషన్ ఏర్పాటు చేశారు. దీనిని లెదర్ తో రూపొందించారు. సెంట్రల్ ఏసీ తో పాటు, ఇరువైపులా ఏసీ సౌకర్యం కల్పించారు. రోడ్డు పై ప్రయాణిస్తున్న నేపథ్యంలో వడిదుడుకులకు లోను కాకుండా ఉండేందుకు సస్పెన్స్ స్ప్రింగులు ఏర్పాటు చేశారు. పూర్తి ఆటోమేషన్ విధానంలో ఈ బస్సు నడుస్తుంది. అందుకు అనుగుణంగానే డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు.. ఒక్కో బస్సులో 40 నుంచి 45 దాకా స్లీపర్ బెర్త్ లు ఉన్నాయి. లాంగ్ రూట్లలో ఈ సర్వీస్ నడపనున్నారు. ఒకవేళ జనాదరణ బాగుంటే మిగతా రూట్లలో నడపనున్నారు.