
Mammootty: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ నేడు కన్నుమూశారు. ఈ మేరకు సమాచారం అందుతుంది. 93 ఏళ్ల ఫాతిమా వృద్ధాప్యం కారణంగా తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఫాతిమా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. నేడు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
మమ్ముట్టితో పాటు ఫాతిమాకు మొత్తం ఆరుగురు సంతానం అని తెలుస్తుంది. మమ్ముట్టి తల్లి ఫాతిమా మరణవార్త మలయాళ పరిశ్రమలో విషాదం నిపించింది. సూపర్ స్టార్ మమ్ముట్టి తల్లిని కోల్పోయారని తెలిసి అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిత్ర ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మమ్ముట్టి కి తెలుగులో కూడా ఫేమ్ ఉంది. లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతి కిరణం మూవీలో ఆయన లీడ్ రోల్ చేశారు. అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర చిత్రంలో నటించి మెప్పించారు.

ప్రస్తుతం ఆయన అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీలో నటిస్తున్నారు. ఏజెంట్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా మమ్ముట్టి రోల్ ఆసక్తి రేపుతోంది. మమ్ముట్టి-అఖిల్ మధ్య సంఘర్షణ అద్బుతంగా ఉండే అవకాశం కలదు. ఏప్రిల్ 28న ఏజెంట్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సైతం హీరోగా రాణిస్తున్నాడు. గత ఏడాది తెలుగులో దుల్కర్ భారీ హిట్ కొట్టాడు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం భారీ విజయం సాధించింది. మలయాళంలో పాటు తమిళ్, తెలుగు పరిశ్రమల్లో దుల్కర్ రాణిస్తున్నాడు. నేడు దుల్కర్ నాన్నమ్మను కోల్పోయారు.