BJP: భారతీయ జనతాపార్టీ.. అప్రతిహత జైత్రయాత్రతో దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. మోదీ–షా ద్వయం ఆధ్వర్యంలో ఒక్కో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తూ అధికారంలోకి వస్తోంది. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కమలం దూకుడుకు కళ్లెం వేయలేకపోతున్నాయి. ప్రతిపక్షాల బలహీనతలే తమ బలంగా మార్చుకుని కమలనాథులు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ జైత్రయాత్రలో భారతీయ జనతా పార్టీ 2023 అత్యంత క్లిష్టమైన సవాల్ విసరబోతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే బీజేపీ సెమీఫైనల్ ఎదుర్కోబోతోంది. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావం తగ్గలేదని.. కమలం వాడిపోలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతోంది.

వ్యూహాలు సిద్ధం చేస్తున్న కమలనాథులు..
తొమ్మిది రాష్ట్రాల్లోల జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగడం లేదు. ఏడాది మొత్తం జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ అత్యంత బలంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు కొత్త రాష్ట్రాలను చేజిక్కించుకోవాలి. పొరపాటున ఒక్క రాష్ట్రం కోల్పోయినా ఇబ్బందికరమే.
తెలంగాణపై ఫోకస్..
తెలంగాణలో కూడా హాట్ ఫేవరేట్‌గా ఉన్నామని.. గెలిచి తీరుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న భావన తెలంగాణ ప్రజల్లోనూ నెలకొంది. కాంగ్రెస్ బలహీనపడుతోంది. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ధీమా కమలనాథుల్లో కనిపిస్తోంది. అయితే ఎక్కడ నిరాశజనక ఫలితాలొచ్చినా ఆ ఎఫెక్ట్ వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది.

కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని..
కేంద్రంలో బీజేపీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమలనాథులు రాజకీయ ప్రణాళికలు రెడీ చేస్తుకుంటున్నారు. అది జరగాలంటే సెమీ ఫైనల్‌గా భావిస్తున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి. అయితే పరిస్థితి అనుకున్నంత తేలిగ్గా లేదని.. ఆ విషయం బీజేపీ నేతలకూ తెలుసు. గుజరాత్‌లో ఏకపక్ష విజయం సాధించినా హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారం చేజారింది. గతంలోలా మోదీ క్రేజ్ ఉందా అంటే.. ఉందని చెప్పలేని పరిస్థితి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సోషల్ మీడియా, మీడియా హైప్ ద్వారా.. క్రేజ్‌ను నిలబెట్టడం ఇంకా ఎంతో కాలం సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ ఏడాది గెలిస్తేనే వచ్చే ఏడాది బీజేపీకి శుభమే.. లేకపోతే కేంద్రంలో హ్యాట్రిక్ కష్టమే..!