
Samantha: సమంతకు మాయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత ఈ విషయం వెల్లడించారు. చికిత్స తీసుకుంటున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఈ మాయోసైటిస్ అంటే ఏంటి? సమంత కోలుకుంటుందా? అనే సందేహాలు అభిమానుల మెదళ్ళు తొలిచేశాయి. దీంతో సమంత యశోద చిత్రం కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తన హెల్త్ కండిషన్ మీద అప్డేట్ ఇచ్చారు. పత్రికల్లో రాసినట్లు నేనేమి చనిపోవడం లేదు, అలాగని ఇది చిన్న సమస్య కూడా కాదు.
నేను పోరాడాల్సి ఉంది. బయటపడతానని విశ్వాసం ఉంది… అంటూ కన్నీరు పెట్టుకున్నారు. యశోద చిత్ర విడుదల అనంతరం సమంత కొన్నాళ్లు బయటకు రాలేదు. ఆమె ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఓ రెండు నెలలుగా సమంత యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. ఇటీవల తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యారు. సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ షూటింగ్స్ చేస్తున్నారు.
కాగా శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సమంత మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తన ప్రస్తుత హెల్త్ కండిషన్ మీద స్పందించారు. సమంత మాట్లాడుతూ… మాయోసైటిస్ సోకిన కొత్తలో నాకు చాలా నీరసంగా ఉండేది. అతి కష్టం మీద యశోద మూవీ కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ఆ చిత్ర బాధ్యత నా భుజాలపై ఉంది. అందుకే తప్పలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఆరోగ్యం మెరుగవుతున్న కొద్దీ దైర్యంగా ఉంటున్నాను, అన్నారు.

మాయోసైటిస్ నుండి ఆమె కోలుకుంటున్నట్లు చెప్పారు. అలాగే అప్పటి పరిస్థితితో పోల్చుకుంటే పర్లేదని స్పష్టత ఇచ్చారు . అయితే పూర్తిగా ఆ మహమ్మారి నుండి బయటపడినట్లు సమంత చెప్పలేదు. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. ఐదు నెలలు కావస్తున్నా సమంతను మాయోసైటిస్ వదల్లేదని తెలుస్తుంది. సమంత గత రెండేళ్లుగా వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగ చైతన్యతో విడాకులైన బాధ నుండి బయటపడిందో లేదో మాయోసైటిస్ రూపంలో మరో ఇబ్బంది ఆమెను చుట్టుముట్టింది. కాగా సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. దేవ్ మోహన్, మోహన్ బాబు కీలక రోల్స్ చేశారు. మణిశర్మ సంగీతం అందించారు.