
Preeti Case: సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గత ఐదు రోజులుగా తమ కస్టడీలో ఉన్న సైఫ్‌ను వారిదైన శైలిలో విచారించగా శుక్రవారం అతడు నోరు విప్పాడు. పలు కీలక విషయాలు చెప్పాడు. ఈసందర్భంగా అతడు చెప్పిన విషయాలతో విస్తుపోవడం పోలీసుల వంతయింది. ఇక సైఫ్ చెప్పి న విషయాలను రికార్ట్ చేసుకున్న పోలీసులు, ఆ ఆధారాలతో మరింత సమాచారం రాబట్టారు. ఇందుకు సాంకేతిక నిపుణలు సహాయం తీసుకున్నారు. ప్రీతి సన్నిహితులు, స్నేహితుల ద్వారా పలు కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అయితే తొలి రోజు కస్టడీలో సైఫ్ ముభావంగా ఉండగా, తర్వాత రోజుల్లో మాములుగానే ఉన్నాడని, ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు అంటున్నారు.
కీలకంగా స్ర్కీన్‌షాట్స్
ప్రీతి ఎమ్-01 లైట్ బ్లూ కలర్ మొబైల్ వాడేది. ఆమె ఫోన్‌లో 27 స్ర్కీన్ షాట్స్, పలు మెసెజ్‌లు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. వాటిని ఇప్పుడు పోలీసులు క్రోడీకరిస్తున్నారు. మరోవైపు ఆమె కీలకంగా ఉన్న మెడికో నుంచి ఎల్‌డీడీ, నాకౌట్ వాట్సాప్ గ్రూప్ నుంచి మూడు, డాక్టర్ గాయత్రి, డాక్టర్ సంధ్య నుంచి మూడు మెసేజ్ ల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అటు డాక్టర్ వైశాలి నుంచి ఆరు, సంధ్య నుంచి పది, డాక్టర్ స్పందన, సైఫ్ నుంచి ఒక్కో చాట్‌ను పోలీసులు సేకరించారు. దీనిపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. అయితే పోలీసులు బయటకు చెప్పడం లేదు గాని ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.
మొత్తం 9 మంది నుంచి..
ప్రీతి కేసుకు సంబంధించి పోలీసులు తొమ్మిది మంది నుంచి వివరాలు రాబట్టారు. అంతేకాకుండా ప్రీతి ఆత్మహత్య చేసుకున్న రోజు ఎంజీఎం హెడ్ నర్స్ ఎల్లందుల సునీత, స్టాఫ్ నర్స్ చిన్నపల్లి కళాప్రపూర్ణ నుంచి పోలీసులు పలు విషయాలను రాబట్టారు. ఇక ప్రీతి వాడిన నలుపు రంగు షోల్డర్ బ్యాగులో పోలీసులు 24 ఆధారాలను సేకరించినట్టు సమాచారం. ఇవి కేసు విచారణలో కీలకంగా మారే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. అయితే సంఘటనాస్థలంలో మజా కూల్ డ్రింక్ బాటిల్, లే స్ చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్స్ ఉన్నాయని, అయితే ఇవి ఎందుకు తెచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇక ఎంజీఎం సెక్యూరిటీ గార్డ్స్ సాంబరాజు, కిషోర్ నుంచి పోలీసులు పలు విషయాలు తెలుసుకున్నారు.

ఇక్కడి దాకా వస్తుందనుకోలేదు
కాగా విచారణలో నోరు విప్పిన సైఫ్.. తాను ప్రీతిని మందలించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నట్టు తెలిసింది. తమ వాట్సాప్ గ్రూపుల్లో వివాదం జరిగింది నిజమేనని, ఆమెకు బుర్రలేదని తాన తిట్టినానని సైఫ్ అంగీకరించాడు. కానీ ఇంత దాకా వస్తుందనుకోలేదని వివరించినట్టు తెలుస్తోంది. పోలీసుల కస్టడీలో ఉన్న సైఫ్ తొలి నాలుగు రోజులు సహకరించలేదు. తర్వాత వారిదైన శైలిలో విచారించగా నోరు విప్పాడు. అయితే అతడు చెప్పిన ఆధారాల ప్రకారం విచారణ చేసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. కాగా పోలీసుల విచారణ నేపథ్యంలో ఎంజీఎం, వైద్య విద్యార్థుల హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.