
ప్రధాని నరేంద్ర మోదీ 2016లో నోట్ల రద్దు చేసిన తరువాత కొత్త 500, 2000 రూపాయల నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత 2,000 రూపాయల నోట్లు రద్దవుతాయంటూ భారీగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్బీఐ 2,000 రూపాయల నోట్లు రద్దవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. అయితే తాజాగా మరోసారి 2,000 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
ఆర్బీఐ తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క 2,000 రూపాయల నోటు కూడా ముద్రించలేదని కీలక ప్రకటన చేసింది. చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లను క్రమంగా తగ్గిస్తున్నామని కీలక ప్రకటన చేసింది. గత కొన్ని నెలల నుంచి 2,000 నోట్లు మినహా మిగిలిన నోట్లను పెద్దఎత్తున మార్కెట్లోకి చలామణిలోకి తెచ్చామని ఆర్బీఐ తెలిపింది. అందువల్ల ఈ నోట్ల వాడకం భారీగా పెరిగింది. అయితే ఆర్బీఐ ప్రకటనతో 2,000 నోట్ల రద్దు గురించి ప్రచారం జరుగుతున్నా నోట్ల రద్దు వార్త నిజం కాదు.
మరోవైపు కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రభావం నోట్ల సరఫరాపై తీవ్రంగా పడిందని ఆర్బీఐ తెలిపింది. గతేడాదితో పోలిస్తే 23.3 శాతం నోట్ల సరఫరా తగ్గిందని పేర్కొంది. అయితే ఇదే సమయంలో నకిలీ నోట్ల సంఖ్య పెరగడంతో నకిలీ నోట్ల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆర్బీఐ కీలక సూచన చేసింది. మరోవైపు 2,000 నోట్ల రద్దు గురించి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పలువురు మోసగాళ్లు ఈ నోట్లను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం.