Rao Ramesh Biography: తెలుగు సినిమా విలనిజానికి కొత్త అర్థం చెప్పారు రావు గోపాలరావు. ఆయన డైలాగ్ డెలివరీ, డిక్షన్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో పాటు మిమిక్రీ ఆర్టిస్స్ రావు గోపాలరావు వాయిస్ ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. అంత ఫేమస్ విలన్ ఆయన. ముత్యాల ముగ్గు మూవీలో రావు గోపాలరావు చెప్పిన ‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలా” అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. రావు గోపాలరావు ఐకానిక్ డైలాగ్స్ తెలుగు ప్రేక్షకుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు . తండ్రి మాదిరి నటన, డైలాగ్ డెలివరీలో తనకంటూ సపరేట్ మేనరిజం క్రియేట్ చేసుకున్నారు. ఈ తరం గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.
బాల్యం-విద్యాభ్యాసం
1968 మే 25న శ్రీకాకుళంలో రావు రమేష్ జన్మించారు. చదువు సంధ్యలు సాగింది మాత్రం చెన్నైలో. తండ్రి రావు గోపాలరావు స్టార్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీ రామకృష్ణ మిషన్ స్కూల్ టి.నగర్ నందు స్కూలింగ్ పూర్తి చేశాడు. కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన ఫోటోగ్రఫీ మీద ఆసక్తి చూపడం విశేషం. స్టిల్ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. 1992లో తండ్రి రావుగోపాలరావు మరణించారు. దాంతో ఆయనకు పరిశ్రమలో మద్దతు కరువైంది. రావు గోపాలరావు కుమారుడు అనే పేరు మినహాయించి రావు రమేష్ కి ఎలాంటి సాయం లభించలేదు.
సినిమా కెరీర్
నటుడిగా ఎదిగే క్రమంలో రావు రమేష్ కొన్ని సీరియల్స్ లో నటించారు. 2002లో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. బాలయ్య సంక్రాంతి చిత్రం సీమ సింహం లో ఓ పాత్ర చేశారు. ఆయనకు బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం కొత్త బంగారు లోకం. కాలేజ్ లెక్చరర్ పాత్రలో రావు రమేష్ మ్యాజిక్ చేశారు. యూత్ ని బాగా స్టడీ చేసిన టీచర్ గా రావు రమేష్ నటన చాలా సహజంగా ఉంటుంది. కొత్త బంగారు లోకం బ్లాక్ బస్టర్ హిట్ కావడం రావు రమేష్ కి ఆఫర్స్ పెరిగాయి.
మగధీర, మర్యాదరామన్న, ఖలేజా, మిరపకాయ్ వంటి చిత్రాలలో ఆయన విలక్షణ పాత్రలు చేసి మెప్పించారు. తెలుగు సినిమాల్లో హిందీ విలన్స్ హవా నడుస్తున్న రోజుల్లో రావు రమేష్ గొప్పగా ఎదిగారు. రావు రమేష్ ఫార్మ్ లోకి వచ్చాక చాలా మంది హిందీ నటులను టాలీవుడ్ డైరెక్టర్స్ పక్కన పెట్టేశారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ ని కూడా రావు రమేష్ డామినేట్ చేసేశారు. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ లో ఉన్న లోపాల కారణంగా రావు రమేష్ బెస్ట్ ఛాయిస్ అయ్యారు.
కెజిఎఫ్ 2 వంటి భారీ పాన్ ఇండియా మూవీలో రావు రమేష్ కి కీలక పాత్ర దక్కింది. ఏడాదికి 15-20 సినిమాలు చేసేంత బిజీ యాక్టర్ అయ్యారు. ఎవరి సప్పోర్ట్ లేకుండా కేవలం తన ప్రతిభతో ఎదిగిన నటుడు రావు రమేష్. వర్థమాన నటులకు ఆయన స్ఫూర్తి. ప్రస్తుతం ఆయన పుష్ప 2, రావణాసురతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు.