
Ram Gopal Varma : చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. నేడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళి రాజు మంతెన కన్నుమూశారు. 70 ఏళ్ల మురళి రాజు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మంతెన మురళి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వరకు స్వయానా మేనమామ అవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరంలో పుట్టిన మంతెన మురళి రాజు నిర్మాతగా పరిశ్రమలో అడుగుపెట్టారు. కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆయన వ్యాపారవేత్త కూడాను. పలు రకాల వ్యాపారాల్లో రాణించారు.
మంతెన మురళి రాజు కుమారుడు మంతెన మధు స్టార్ ప్రొడ్యూసర్ కావడం విశేషం. మధు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ముప్పైకి పైగా చిత్రాలు నిర్మించారు. బంధువు రామ్ గోపాల్ వర్మ ఆయన్ని ప్రోత్సహించారు. వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 చిత్రాలను మధు నిర్మించారు. అలాగే హిందీ గజినీ, క్వీన్, సూపర్ 30 ఇలా అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలను మధు మంతెన నిర్మించారు. హిందీలో మధు ఎక్కువ చిత్రాలు నిర్మించారు.
అల్లు అర్జున్ ఫ్యామిలీతో మురళి రాజు మంతెనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మురళి రాజు మరణవార్త తెలిసిన అల్లు అర్జున్ మధురానగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం అల్లు అరవింద్, బన్నీ వాసు సైతం మురళి రాజు పార్థివదేహం సందర్శించి నివాళులు తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అలాగే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ముంబై నుండి వస్తున్నారట. నిర్మాత మధుతో పాటు మంతెన మురళితో ఆయనకు అనుబంధం ఉందట. మురళి రాజు మరణవార్త విన్న అమీర్ ఖాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ముంబై నుండి ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజులు నెలల వ్యవధిలో కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, చలపతిరావు, కే విశ్వనాథ్, వాణి జయరాం కన్నుమూశారు. తాజాగా మురళి రాజు అనారోగ్యంతో మృత్యువాతపడ్డారు.