Dhee 15: రియాల్టీ షోలకు కొన్ని కాంబినేషన్లు పర్ఫెక్ట్ సూట్ అవుతాయి. వాటిని అసలు గెలకకూడదు.. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు వారిని ఓన్ చేసుకొని ఉంటారు. పైగా ఇప్పుడు అసలే సోషల్ మీడియా రోజులు. ఏమాత్రం తేడా కొట్టినా బాయ్ కాట్ ఉద్యమాలు తెరపైకి వస్తాయి. ఇక తెలుగునాట రియాల్టీ షో లలో ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ అనే ప్రోగ్రాం కు మంచి ఆదరణ ఉంది.. అప్పట్లో రశ్మి, సుధీర్ ఉన్నప్పుడు మంచి రక్తి కట్టేది. జబర్దస్త్ కంటే ఎక్కువ టిఆర్పి రేటింగ్ సాధించేది.. మల్లెమాల కూడా బాగా ఫోకస్ చేయడంతో తిరుగులేని డ్యాన్స్ షో గా రికార్డు సాధించింది. బంగారు బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది.. అలా కాదు మొత్తం గుడ్లు ఒకేసారి కావాలని కోస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఢీ షో లో కూడా అదే జరిగింది.

గాడి తప్పింది
ఢీ షో నుంచి రష్మీ, సుధీర్ ను వెళ్లగొట్టారు. దీంతో అప్పుడే ఈ డ్యాన్స్ రియాల్టీ షో గాడి తప్పింది. జడ్జిలుగా ఎవరు వస్తున్నారో ఎవరికీ తెలియదు. మెంటార్లు, కామెడీ స్కిట్స్ చేసే వాళ్ళు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియదు. ఒక ప్రదీప్, ఆది మాత్రమే స్థిరంగా కనిపిస్తున్నారు. జనానికి కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ మొనాటనీ తెప్పిస్తోంది. పైగా పూర్ణ లేదు. యానీ మాస్టర్ లేదు. మొన్నటిదాకా ఏవో తిప్పలు పడ్డ అఖిల్ సార్ధక్ లేడు. అసలు షోను మొదటి నుంచి మోసిన వాళ్లు ఎవరూ లేరు. నందిత శ్వేత, రవి, నవ్య స్వామి, సుస్మిత.. అసలు ఎవరు వీళ్లంతా? కేవలం నాలుగు రోజుల మురిపెం కోసమే తీసుకొచ్చారా? అలాంటప్పుడు వీరంతా మనసుపెట్టి ఎందుకు చేయాలి? ఈ ప్రశ్నలకు మల్లెమాల వద్ద సమాధానం ఉండదు. ఇప్పుడు కనిపిస్తున్న దివ్య, శ్రద్దా దాస్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, ప్రదీప్ కూడా వేస్ట్. మొత్తం షోను ఆదికే అప్పగిస్తే సరిపోయేది.. ఇప్పుడు బిగ్ బాస్ ఫేం జెస్సీ కూడా ఆదికి తోడుగా కనిపిస్తున్నాడు. ఇంకేముంది రియాల్టీ షో కాస్త జబర్దస్త్ 3 అవుతుంది. అప్పుడు న బూతో న భవిష్యత్.
ఇప్పుడు 15 వ సీజన్
ఒక రియాల్టీ షో15 సీజన్లు అంటే మామూలు విషయం కాదు.. ఈసారి బిగ్గర్ దెన్ ఎవర్, బెటర్ దెన్ ఎవర్.. అంటూ ఛాంపియన్షిప్ బాటిల్ పెట్టారు. దీనికి 12 మందిని ఛాంపియన్ లుగా చూపిస్తున్నారు. అందరివి డ్యాన్సులు చూపించారు.. పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇందులో ఆది మార్క్ బీ గ్రేడ్ డైలాగుల చికాకు లేదు. చివరకు ఎపిసోడ్ ఎండింగ్లో ప్రదీప్ అందరినీ పిలిచాడు.. కానీ ఆదిని, జెస్సీని పిలవలేదు.. ప్రోమో కోసం అలా చేశారా? నిజంగా ఆదిని పక్కన పెట్టారా అనేది తెలియదు. అప్పట్లో మాటీవీలో ఓంకార్ ఓ డ్యాన్స్ రియాల్టీ షోను ఇరగదీశాడు. ఇప్పుడు ఆహాలోనూ కుమ్మేస్తున్నాడు. కానీ రేటింగ్స్ లో మాత్రం ఫ్లాప్.. ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే తనకు బలంగా ఉన్న రియాల్టీ షో లను ఈటీవీ తనే దెబ్బ తీసుకుంటుంది.. పనికిమాలిన మార్పులు చేసుకుంటూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నది.

ప్రభుదేవా వచ్చాడు
ఈసారి ప్రభుదేవా ముఖ్యఅతిథిగా పిలిచారు. నిజానికి ఎవరో సినిమా హీరోలను పిలవడం కంటే ప్రభుదేవా వంటి హీరోలు కరెక్టు. ఎందుకంటే అలాంటివారు స్వతహాగా కొరియోగ్రాఫర్లు.. పైగా ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా దేశంలో హై ఎండ్ పర్సనాలిటీ. సరే అతని వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. దాన్ని వదిలేస్తే కొరియోగ్రాఫర్ గా, డాన్సర్ గా అల్టిమేట్ క్యారెక్టర్. రేటింగ్స్ పడిపోతున్న నేపథ్యంలో మల్లెమాల ఎలాగైనా ఢీ ని లేపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జాకీలు పెట్టి లేపాలని చూస్తోంది.. అందరూ వెళ్లిపోయాక.. కాదు కాదు… వెళ్ళ కొట్టాకా ఇప్పుడు తీరిగ్గా చింతిస్తోంది.. నిజంగా ఆ మల్లెమాల క్రియేటివ్ టీం ఎవరో కానీ దండం పెట్టాలి.