
Pakistan- Narendra Modi: విశ్వగురువుగా కీర్తి గడించిన ప్రధాని నరేంద్రమోదీ కోసం మన దాయాది దేశం పాకిస్తాన్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపే శక్తి భారత్‌కు మాత్రమే ఉందని బ్రిటన్, జర్మన్, ఉక్రెయిన్ దేశాధినేతలు బహిరంగంగా ప్రకటించారు. ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరారు. తాజాగా మన శత్రుదేశం పాకి స్తాన్ ప్రజలు కూడా తమకు మోదీ కావాలని కోరుకుంటున్నారు. మోదీ మాత్రమే పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చి తమ జీవితాలను మారుస్తారని భావిస్తున్నారు. ఈమేరకు ఒక పాకిస్తానీ వేడుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పాక్ యూట్యూబర్ రూపొందించిన వీడియోలో ఒక పౌరుడు ప్రస్తుత పాక్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ అదే సమయంలో మోదీని ప్రశంసించడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో అటు పాక్, ఇటు ఇండియాలో వైరల్‌గా మారింది. పాకిస్తానీలు తమను భారత్‌తో పోల్చుకోవడం మానుకోవాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే రెండు దేశాల మధ్య పోలిక లేదని అతను అభిప్రాయపడ్డాడు.
దేశ ఆర్థిక పరిస్థితిపై వీడియో..
పాకిస్థానీ యూట్యూబర్ సనా అమ్జాద్ ఇటీవల ఒక వీడియోను రూపొందించారు. అందులో తోటి పాకిస్తానీ పౌరుడు ఒకరు పాక్ ప్రధాని షెహబాజ్‌పై విరుచుకుపడ్డాడు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు షరీఫ్ ప్రభుత్వం కారణమని దుయ్యబట్టాడు. భారత ప్రధాని నరేంద్రమోదీ తమ దేశానికి నాయకత్వం వహిస్తుంటే, వారు కనీసం సరసమైన ధరకు వస్తువులను కొనుగోలు చేయగలుగుతామని ఆ వ్యక్తి వీడియోలో వ్యాఖ్యానించాడు. ‘పాకిస్తాన్ సే జిందా భాగో చాహే ఇండియా చలే జావో‘ (పాకిస్తాన్ నుంచి మీ ప్రాణాలను కాపాడుకోండి, భారతదేశంలో ఆశ్రయం పొందడం ద్వారా అయినా పారిపోండి) అనే నినాదాన్ని వీధుల్లో ఎందుకు లేవనెత్తారని ఆమె స్థానికుడిని అడగడం వినిపించింది. అందుకు అతను పాకిస్తాన్‌లో పుట్టకూడదని కోరుకుంటున్నానని బదులిచ్చారు. భారత విభజన జరగకుండా ఉండి ఉంటే తాను, తన తోటి దేశస్తులు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి, ప్రతీ రాత్రి తమ పిల్లలకు భోజనం పెట్టగలిగే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పాకిస్తాన్‌ను భారతదేశం నుంచి వేరు చేసి ఉండి ఉండకూడదని నేను భావిస్తున్నాను. దేశ విభజన జరగకుండా ఉండి ఉంటే మేము టొమాటోలను రూ. 20కి, చికెన్ రూ. 150కి, పెట్రోల్‌రూ.50 చొప్పున కొనుగోలు చేసేవాళ్లం’ అని అతను చెప్పాడు. ‘మనకు ఇస్లామిస్ట్ దేశం వచ్చింది కానీ ఇక్కడ ఇస్లాంను స్థాపించలేకపోవడం దురదృష్టకరం’ అని పేర్కొన్నాడు.
మోదీ తప్ప ఎవరూ బాగుచేయలేరు..
‘తమ దేశాన్ని బాగు చేయగలిగింది నరేంద్ర మోదీ తప్ప మరెవరూ లేరు’ ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. ‘మోదీ మనకంటే చాలా గొప్పవాడు, ఆయన ప్రజలు ఆయనను చాలా గౌరవిస్తారు, అనుసరిస్తారు. మనకు నరేంద్ర మోడీ ఉంటే, మనకు నవాజ్ షరీఫ్ లేదా బెనజీర్ లేదా ఇమ్రాన్ లేదా( దివంగత మాజీ మిలిటరీ పాలకుడు) జనరల్ (పర్వేజ్) ముషారఫ్ అవసరం లేదు. మనకు కావలసింది ప్రధాని మోదీ మాత్రమే, దేశంలోని అన్ని దుర్మార్గపు అంశాలను ఆయన మాత్రమే ఎదుర్కోగలడు. ప్రస్తుతం మనం ఎక్కడా లేనప్పుడు భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది’ అని వివరించాడు.

మోదీ పాలనతో బతకాలని కోరుకుంటున్నా..
‘మోదీ పాలనలో నేను జీవించాలని కోరుకుంటున్నా.. మోదీ గొప్ప వ్యక్తి, చెడ్డవాడు కాదు.. భారతీయులకు టమాటా, చికెన్‌ను సరసమైన ధరలకు అందజేస్తున్నారు’ అని ప్రశంసించాడు. రాత్రిపూట మీ పిల్లలకు భోజనం పెట్టలేనప్పుడు మీరు ఉన్న దేశాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు అని తన దేశ నాయకులపై దుమ్మెత్తి పోశాడు. ‘మోదీని మనకు అందించాలని, ఆయన మన దేశాన్ని పాలించేలా చేయాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
వీధుల్లో భారత అనుకూల నినాదాలు
ప్రస్తుతం పాకిస్తాన్ వీధుల్లో ఒక నినాదం మార్మోగుతోంది. ‘ ప్రాణాలతో ఉండాలంటే, పాకిస్తాన్‌ను విడిచి పారిపోండి. కావాలంటే భారత్ కైనా వెళ్లండి’ అనేదే ఆ నినాదం. దానిపై సానా అమ్జాబ్ అనే స్థానిక జర్నలిస్ట్ ఒక వ్యక్తిని ప్రశ్నించగా.. పాకిస్తాన్ లో పుట్టకపోయి ఉంటే బావుండేది’ అని ఆ వ్యక్తి సమాధానిచ్చాడు.
