Collector’s wedding : వారిద్దరూ కలెక్టర్లు. జిల్లాకు సంబంధించి ప్రధమ పౌరులు. అప్పుడప్పుడు విధి నిర్వహణలో కలుసుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. తర్వాత అది ఇష్టంగా మారింది. చివరికి అది ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు..ఇందులో పెద్ద వింత గతంలో ఎందుకు విడిపోయారు అంటే ఏముందని అనుకుంటున్నారా? పైగా వారిద్దరూ కలెక్టర్లు కాబట్టి ఏదయినా చేసేయగలరు. ఇది కూడా ఒక వార్తేనా అని మీరు అనుకోవచ్చు. కానీ అందరిలాగా ఇది రొటీన్ లవ్ స్టోరీ కాదు.. అదేంటో మీరూ చదివేయండి.
గతంలో పెళ్ళి
ఒడిస్సా రాష్ట్రం పూరి కలెక్టర్ గా సమర్థవర్మ, రాయగడ కలెక్టర్ గా స్వాధా దేవ్ సింగ్ పనిచేస్తున్నారు. అయితే వీరికి గతంలోనే వేరువేరు వ్యక్తులతో వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ మనస్పర్ధలు తలెత్తి వారి భాగస్వాములతో విడాకులు తీసుకున్నారు. దీంతో అప్పటినుంచి విడిగానే ఉంటున్నారు. స్వాధా దేవ్ బోలంగిర్ కలెక్టర్ చంచల రాణా ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పూరి కలెక్టర్ సమర్థవర్మ కూడా ఇటీవల రైల్వే అధికారిణి సుచి సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య కూడా మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.

మనసులు కలిశాయి
2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సమర్థవర్మ గతంలో కేంద్ర పారా జిల్లా మెజిస్ట్రేట్, బీఎంసీ కమిషనర్, రాయగడ పిడిడిఐ, సంబల్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ గా పనిచేశారు. అలాగే స్వధా దేవ్ సింగ్ గతంలో జిల్లా కలెక్టర్ గా, రూర్కెలా అదనపు జిల్లా కలెక్టర్ గా పని చేశారు. అయితే విధి నిర్వహణలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరిద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15న వారిద్దరికీ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లికి పూరికి చెందిన కొంతమంది సేవాయత్ లను కూడా ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి విధి నిర్వహణలో వీరిద్దరు కూడా మంచి అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే గతంలో వీరిద్దరికీ వేరువేరు వ్యక్తులతో వివాహం జరగడం, తర్వాత విడిపోవడం, ఇప్పుడు మళ్లీ వారిద్దరూ ప్రేమలో పడటం, పెళ్లి దాకా వెళ్లడం సామాజిక వేదిక ల్లో వైరల్ గా మారింది. అంతేకాదు వీరిద్దరూ తీసుకొన్న నిర్ణయం పట్ల హర్షం కూడా వ్యక్తమవుతోంది.
జీవితాన్ని సరిదిద్దుకున్నవారే..
ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకుల్లో కొన్ని తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పులను సరిదిద్దుకున్నవారే జీవితంలో నిలబడతారు. ఇప్పుడు దానిని నిరూపించారు సమర్థవర్మ, స్వాదా దేవ్ సింగ్. పేరుకు ఇద్దరు కలెక్టర్లు అయినప్పటికీ తమ జీవితానికి సంబంధించిన విషయాల్లో మాత్రం సామాన్య మనుషుల లాగానే ఆలోచించారు. అదే ఇప్పుడు వీరిని వార్తల్లో వ్యక్తులను చేసింది.