
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ సంఖ్యలో రైళ్లు అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతేడాది మే నెల నుంచి ప్రత్యేక రైళ్ల పేరుతో రైల్వే శాఖ తక్కువ సంఖ్యలో రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. దశల వారీగా రైల్వే శాఖ రైళ్ల సంఖ్యను అంతకంతకూ పెంచుతోంది.
అయితే తాజాగా రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నడుపుతున్న రైళ్లతో పోలిస్తే అదనంగా 115 ఎక్స్ ప్రెస్, మెయిల్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. అదనపు రైళ్లకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా నడుపుతున్న రైళ్ల సంఖ్య ఏకంగా 1,138కు చేరింది. రైల్వే శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో అదనపు రైళ్లకు సంబంధించి ఈ విషయాలను వెల్లడించారు.
అదనపు రైళ్లను నడపడం గురించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని.. దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. కరోనా విజృంభణకు ముందు నడిపే రైళ్లతో పోలిస్తే ప్రస్తుతం రైల్వేశాఖ నడుపుతున్న రైళ్ల సంఖ్య చాలా తక్కువ కావడం గమనార్హం. ఈ 1,138 రైళ్లతో పాటు వేర్వేరు జోన్లలో 4,807 సబర్బన్ రైలు సర్వీసులను కూడా నడుపుతున్నారు.
మరోవైపు కరోనా ఉధృతి తగ్గడంతో పూర్తిస్థాయిలో రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని రైలు ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నాటికి పూర్తిస్థాయిలో రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.