Tarakaratna Health Update: నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మెరుగైన వైద్యం కోసం రాత్రి ఆయన్ని బెంగుళూరుకు తరలించారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న తారకరత్నను వ్యక్తిగత సిబ్బంది దగ్గర్లో ఉన్న కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు సీపీఆర్ నిర్వహించారు. అనంతరం పీఈఎస్ ఆసుపత్రికి మార్చారు. ఐసీయూలో ఉంచి తారకరత్నకు వైద్యం నిర్వహించారు. మొదట బెంగుళూరికి తరలించాలని అనుకున్నారు. ఎయిర్ లిఫ్ట్ కి అవకాశం లేకపోవడంతో రోడ్డు మార్గాన తారకరత్నను బెంగుళూరు తరలించాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలో బెంగుళూరు హృదయాల ఆసుపత్రి నుండి ఎక్స్పర్ట్ వైద్యులను పీఈఎస్ ఆసుపత్రికి పిలిపించారు. ఐదుగురు సభ్యులతో కూడిన వైద్య బృందం ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తారకరత్నను బెంగుళూరు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కుప్పం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె అనుమతితో వైద్యులు ప్రత్యేక అంబులెన్స్ లో బెంగుళూరు హృదయాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.
గుండె ఎడమ వైపు వాల్వ్స్ 90 శాతం వరకు బ్లాక్ అయ్యాయి. ఆ కారణంగా హార్ట్ అటాక్ బారినపడ్డారు. మధ్యాహ్నమే బెంగుళూరు తరలించాలని యోచించారు. అయితే దారిలో సెకండ్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని కుప్పం ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని అనుకున్నారు. రాత్రి వైద్యుల సూచన మేరకు భార్య అలేఖ్య రెడ్డి అనుమతితో ఆయన్ని బెంగుళూరుకు షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తిరిగి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

నేడు బెంగుళూరుకి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చేరుకోనున్నారని సమాచారం. ఎన్టీఆర్ నిన్న బాలయ్యకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా తారకరత్న క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. 2024లో ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. లోకేష్ కి మద్దతుగా యువగళం కార్యక్రమంలో తారకరత్న, బాలకృష్ణ పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తారకరత్న అనారోగ్యం బారిన పడ్డారు. జనాల మధ్య నడుస్తున్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.