
మనలో చాలామంది మాంసాహార ప్రియులు ఉంటారు. మాంసాహార ప్రియులకు ఆదివారం వచ్చిందంటే తినడానికి మాంసం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఖరీదు ఎక్కువైనా మాంహాసర ప్రియులు చికెన్, మటన్ కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయరు. అయితే ఆదివారం భారీగా మాంసం విక్రయాలు జరుగుతాయి కాబట్టి వినియోగదారులను టార్గెట్ చేసి మటన్ మాఫియా రెచ్చిపోతుంది.
ఏపీలోని విజయవాడ ప్రాంతంలో మటన్ మాఫియా ఆగడాలను అడ్డూఅదుపు లేకుండా పోయింది. వినియోగదారులకు రెండు, మూడు రోజుల నుంచి నిల్వ ఉంచిన మటన్ ను విక్రయిస్తూ మాఫియా ముఠా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడకు వస్తున్న పొట్టేళ్ల మాంసంను గుర్తించి సీజ్ చేశారు.
రెండు, మూడు రోజుల నుంచి నిల్వ ఉంచిన మాంసం ఢిల్లీ నుంచి విజయవాడకు చేరినట్టు అధికారుల విచారణలో తేలింది. మటన్ మాఫియా రేపు ఆదివారం కాబట్టి ఆ నిల్వ ఉంచిన మాంసాన్ని ఫ్రెష్ మాంసం అని చెప్పి అమ్మాలని ప్రయత్నాలు చేస్తోంది. కార్పోరేషన్ అధికారులకు మాంసం గురించి సమాచారం అందగా నిల్వ ఉంచిన బాక్సులను పరిశీలించి సీజ్ చేశారు. విషయం తెలిసిన ప్రజలు అలాంటి మాంసం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని కఠినంగా శిక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని ఇలాంటి మాంసం తింటే కొత్త వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇమ్యునిటీ పెరగాలని ప్రజలు మాంసం తినడానికి ఆసక్తి చూపుతుంటే ఇలాంటి మటన్ మాఫియాలు నీతిగా వ్యాపారం చేసుకునే వారికి సైతం చెడ్డపేరు తెచ్చిపెడుతున్నాయి.