Megastar Chiranjeevi- Kaikala Satyanarayana: ఇప్పుడంటే పొరుగు నటీనటుల తాకిడి ఎక్కువైపోయింది. వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా సాగుతున్నది వ్యవహారం. ఎవరితోనూ సరిగ్గా బాండింగ్ ఉండదు. అందుకే సినీ పరిశ్రమలో అంత ఆరోగ్యకరమైన వాతావరణం లేదు. నిర్మాత అంటే లెక్కేలేదు.. నయనతార లాంటి నటిమణి అయితే కనీసం సినిమా ప్రమోషన్ కి కూడా రాదు. సరే లోతుల్లోకి వెళ్లడం లేదు గానీ ఉన్న జనరేషన్ లో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అమలులో పెడుతున్నారు.. కొంచెం క్రేజ్ రాగానే దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. సినిమా పరిశ్రమ అంటేనే రంగుల లోకం కాబట్టి.. కొత్త రంగుల వెంటే పరుగులు తీస్తోంది. ఇది ఎంత దాకా వెళ్తుందో తెలియదు కానీ… ఇప్పుడైతే పరిస్థితి బాగోలేదు.. ఇక ముందు బాగుంటుందన్న గ్యారెంటీ లేదు. కానీ వెనుకటి రోజుల్లో ఇలా కాదు. నిర్మాత అంటే భయం ఉండేది. దర్శకుడి మీద గౌరవం ఉండేది. తోటి నటుల మధ్య స్నేహం ఉండేది. వృత్తిపరంగా చేసేది ఒకటే కాబట్టి వయసు తారతమ్యాలు పెద్దగా లెక్కలోకి వచ్చేవి కావు. అందుకే కాబోలు మెగాస్టార్ చిరంజీవి, కైకాల సత్యనారాయణ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. తాను నిర్మాతగా మారిన తర్వాత కొంతమంది మిత్రులతో కలిసి చిరంజీవిని హీరోగా పెట్టి “చిరంజీవి” అనే సినిమా తీశారు. ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ కె ఎస్ ఆర్ దాస్ కాంబినేషన్లో కౌబాయ్ సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తర్వాతి జనరేషన్ కథానాయకుడైన చిరంజీవితో కొదమ సింహం అనే కౌబాయ్ సినిమాను తీశారు. అప్పట్లో ఈ సినిమాకి పెట్టిన ఖర్చు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కైకాల సత్యనారాయణ కి రెండింతల లాభాలు వచ్చాయి. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చిరంజీవి కూడా గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ కూడా పదేపదే ప్రస్తావించేవారు.. అప్పటినుంచి ఏర్పడిన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం అది రాను రాను మరింత బలోపేతం అయింది.

ఇద్దరు కలిసి భోజనం చేసేవారు
ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో కైకాల సత్యనారాయణ మొదటి నుంచి భోజన ప్రియుడు. పైగా చిరంజీవిది కూడా ఆంధ్ర ప్రాంతం కావడంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. వీరి రెండు కుటుంబాలకు దూరపు చుట్టరికం కూడా ఉందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. షూటింగ్ గ్యాప్ లో ఇద్దరు కలిసి భోజనం చేసేవారు. సత్యనారాయణకి చికెన్ వేపుడు, చేపల పులుసు, రొయ్యల ఇగురు బాగా ఇష్టం కావడంతో… చిరంజీవి తన సతీమణి సురేఖతో వండించి ఆయన కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చేవారు.. చిరంజీవి కూడా జున్ను ఇష్టంగా తింటారు కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొచ్చేవారు.

పుట్టినరోజు చేశారు
గత కొంతకాలంగా కైకాల సత్యనారాయణ ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోభారం కూడా దీనికి తోడు కావడంతో కొద్దిరోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు.. ఇటీవల అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆయన పుట్టినరోజు విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి… నేరుగా ఆసుపత్రికి వెళ్లి ఆయన యోగక్షేమాలు కనుక్కున్నారు.. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.. ఆస్పత్రి బెడ్ పై ఉండగానే ఆయనతో ఒక కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఆయన చివరి కోరిక తీర్చారు. యాదృచ్ఛికమో, అలా జరగాల్సి ఉందని విధి రాసిందో తెలియదు కానీ… చిరంజీవి చేసిన పుట్టినరోజే కైకాలకు చివరి జన్మదినమైంది.. ప్రస్తుతం అదే విషయం తలచుకొని చిరంజీవి బాధాతప్త హృదయంతో సామాజిక మాధ్యమాల్లో ఒక లేఖ పోస్ట్ చేశారు. కైకాల సత్యనారాయణ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.