
Manchu Manoj- Maunika: మనోజ్-మౌనికల రిలేషన్షిప్ ఎపిసోడ్ సుఖాంతమైంది. దాదాపు ఆరు నెలలుగా మంచు మనోజ్ పెళ్లి మీద హైడ్రామా నడిచింది. గత ఏడాది వినాయక చతుర్థి వేళ మనోజ్, మౌనిక జంటగా గణేష్ మండపాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ రోజు వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. మనోజ్ భూమా మౌనికతో రిలేషన్లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇద్దరూ విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటున్న వ్యక్తులు కావడంతో పెళ్లి రూమర్స్ చక్కర్లు కొట్టాయి. మంచు ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి మధ్య స్నేహం ఉంది. ఈ రెండు కుటుంబాల స్నేహం ఇప్పటిది కాదు.
మౌనికతో పెళ్లి వార్తలపై మనోజ్ స్పందించలేదు. అలాగే మరి కొన్ని కథనాలు తెరపైకి వచ్చాయి. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మోహన్ బాబు సీరియస్ అయ్యారని. కుటుంబంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. ఎట్టకేలకు మార్చి 3న మనోజ్ వివాహం కుదిరింది. ఈ పెళ్ళికి మంచు లక్ష్మి పెద్దగా వ్యవహరించారు. మూడు రోజులుగా ఆమె ఇంట్లో మనోజ్ పెళ్లి వేడుకలు జరుగుతున్నా మోహన్ బాబు రాలేదు. దీంతో పుకార్లు నిజమే అన్న వాదన వినిపించింది.

అయితే చివరి నిమిషంలో మోహన్ బాబు తళుకున్న మెరిశారు. సతీసమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాగా తండ్రి అంగీకారంతోనే మౌనికను పెళ్లి చేసుకున్నట్లు మనోజ్ తాజాగా వెల్లడించారు. పరోక్షంగా ఆయన ప్రచారమైన పుకార్లకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మార్చి 19న మోహన్ బాబు జన్మదిన వేడుకలు తిరుపతిలో జరిగాయి. ఈ వేడుకలు శ్రీ విద్యానికేతన్ లో నిర్వహించారు. విద్యార్థుల నుండి మనోజ్, మౌనికలకు ఘన స్వాగతం లభించింది. అనంతరం మనోజ్ మాట్లాడారు.
ప్రతి ఒక్క మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందంటారు. అలాగే ప్రతి మగవాడు ఆడవాళ్లను ప్రోత్సహించాలి. తమ అభిరుచులను గౌరవించాలి. ఎంచుకున్న మార్గంలో ఎదిగేలా మద్దతు ఇవ్వాలి. నేను ఇదే నమ్ముతాను. నేను మా నాన్నగారిని కొన్ని వందల సార్లు బాధపెట్టాను. అయినా నా మీద ఆయన ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. ఒక అమ్మాయికి జీవితాంతం తోడుంటానని మాటిచ్చాను నాన్నా, అని చెప్పాను. నా నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తాను అన్నారు. పేరెంట్స్ లేని మౌనికకు తాను తండ్రి అవుతాను అన్నారు. మౌనికను కూతురిగా భావిస్తాను అన్నారని వెల్లడించారు. మనోజ్ మాటలకు పక్కన ఉన్న మౌనిక కన్నీరు పెట్టుకుంది. మంచు కుటుంబం తనపై చూపిస్తున్న ప్రేమకు భావోద్వేగానికి గురైంది.