
Mann Ki Baat: ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ రేడియో మాధ్యమం ద్వారా చేసే ‘మన్‌కీ బాత్’ ప్రసంగం.. ఈసారి ఎల్లలు దాటనుంది. ఏప్రిల్ చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్ కావడంతో దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వినిపించాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు మన్‌కీ బాత్‌లో మోదీ ప్రస్తావించిన వ్యక్తులను ఆరోజు ఢిల్లీకి ఆహ్వానించి సత్కరించనున్నట్టు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ 100 ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ 100 మంది ప్రముఖులను ఆహ్వానించి మన్‌కీ బాత్ వినిపించనున్నట్టు తెలిపారు. బీజేపీకి చెందిన 100 బూత్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపించనున్నారు. కాగా, 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న రేడియో సహా డీడీ మాధ్యమాల ద్వారా ప్రసారం కానుంది. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ కార్యక్రమం 2014, అక్టోబరు 3న ప్రారంభించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ సమాజంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని పరిచయం చేస్తున్నా రు. వీరిలో చాలా మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇది గొప్ప ప్రయత్నమని అప్పట్లో చాలా మంది కితాబిచ్చారు. సమాజంలో భిన్న వర్గాల వారికి మోదీ ప్రాధాన్యం ఇవ్వడంతో వారి చేస్తున్న సేవ దేశం మొత్తం తెలిసింది. మోదీ వారి గురించి చెప్పడంతో చాలా మంది ప్రేరేపితులయ్యారు. ప్రకృతి సంబంధ వస్తువులతో నాప్ కీన్స్ తయారు చేస్తున్న యువతి నుంచి 90 ఏళ్ల వయసులోనూ మొక్కలు నాటుతున్న కర్ణాటక వృద్ధురాలి వరకు అందరి విజయగాథలు మోదీ తన మన్‌కీ బాత్‌లో చెప్పేవారు.

అయితే దీని కోసం ప్రత్యేకమైన టీం పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబధం లేకుండా, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా వారు చేస్తున్న సేవలను మోదీ దృష్టికి తీసుకెళ్తోంది. స్వయంగా ఆయన పరిశీలించిన తర్వాత తన మన్‌కీ బాత్‌లో మోదీ ఈ విషయాలను చెబు తున్నారు. కేవలం వారికి మాత్రమే కాకుండా పరీక్షల సమయంలో విద్యార్థులకు మోదీ సలహాలు ఇస్తున్నారు. విదేశీ పర్యటన ఉంటే తప్ప మన్ కీ బాత్ ను వాయిదా వేయరు. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం వందో ఎపిసోడ్ ను భారీ ఎత్తున చేపట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది.