Mahesh Babu: మహేష్ ఎంత గొప్ప వ్యక్తిత్వంగలవాడో చెప్పడానికి ఈ సంఘటన చాలు. ఆయన ఔదార్యం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఒక ప్రక్క తండ్రి ప్రాణాలతో పోరాడుతున్నా మహేష్ తన బాధ్యత మరువలేదు. ఒక పసివాడి ప్రాణం కాపాడే కర్తవ్యం వీడలేదు. సోమవారం కృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి గంట గంటకు విషమంగా మారుతుంది. ప్రధాన అవయవాలు ఒక్కొక్కటిగా పని చేయడం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. తండ్రిని కాపాడుకోగలనా లేదా అనే తీవ్ర టెన్షన్ లో మహేష్ ఉన్నారు. తండ్రికి వైద్యం జరుగుతున్న అదే రోజు… మరో చోట ఓ పసిప్రాణం కొట్టుకులాడుతుంది. మహేష్ సాయం కోసం ఎదురుచూస్తుంది.

గుండెజబ్బుతో బాధపడుతున్న మోక్షిత్ సాయి అనే చిన్నారిని విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. పేదవారైన మోక్షిత్ సాయి పేరెంట్స్ మహేష్ ఫౌండేషన్ సాయం కోరారు. సోమవారం మోక్షిత్ సాయికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా మహేష్ బాబు తగిన ఏర్పాట్లు చేశారు. తన ఫౌండేషన్ నుండి ఆపరేషన్ కి అవసరమైన డబ్బులు ఏర్పాటు చేశారు. మోక్షిత్ సాయికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ పసివాడికి పునర్జన్మ ప్రసాదించారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్న మహేష్ అత్యవసర సమయంలో స్పందించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. సాయం చేయడంలో ఎవరైనా నీ తర్వాతే అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు వేయి మందికి పైగా చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్ చేయించారు. తన పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలైన చిన్నారులకు మహేష్ వైద్యం చేయిస్తున్నారు. గౌతమ్ పసివాడిగా ఉన్నప్పుడు తీవ్ర ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నాడు. ఖరీదైన వైద్యం చేయించి గౌతమ్ ని కాపాడుకున్నాం. డబ్బులు లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటనే ఆలోచన వచ్చింది. అప్పటి నుండి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పసిపిల్లలకు వైద్యం చేయిస్తున్నట్లు మహేష్ ఓ సందర్భంలో వెల్లడించారు.

ఇక మంగళవారం ఉదయం కృష్ణ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణ పేరిట మెమోరియల్ నిర్మించనున్నట్లు సమాచారం. 30 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ఆయన చిత్రాలకు సంబంధించిన సమాచారంతో మ్యూజియం ఏర్పాటు చేస్తారట.