
Mahesh Babu New Look: మహేష్ స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. అయితే ఆయనను జిమ్ బాడీలో ఎవరూ ప్రజెంట్ చేయలేదు. చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపించింది లేదు. అసలు మహేష్ కండలు పెంచి భారీ కాయంతో కనిపిస్తే ఎలా ఉంటుంది?. బహుశా దర్శకుడు రాజమౌళి ఇదే ఆలోచన చేశారేమో అనిపిస్తుంది. మహేష్ గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో కండలు పెంచేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. తన వర్క్ అవుట్ సెషన్ ఫోటోలు ఆయన షేర్ చేశారు. ప్రత్యేకంగా చేతులు చూపిస్తూ ‘ఆర్మ్ డే’ అని కామెంట్ చేశారు. అంటే చేతుల కండరాలు పెంచే పనిలో ఆయన నిమగ్నమయ్యారని తెలుస్తుంది.
జిమ్ చేయడంతో నరాలు కూడా ఉబ్బి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేష్ జిమ్ బాడీ లుక్ సరికొత్తగా ఉంది. అయితే ఆయన పూర్తి షేప్ సాధించేందుకు సమయం పడుతుంది. ఇటీవలే శరీరం పెంచే కసరత్తు మొదలు పెట్టినట్లున్నారు. మరో రెండు మూడు నెలల్లో రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అప్పటికి మహేష్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే సూచనలు కలవు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. రాజమౌళి మహేష్ ని ఆయన ఎలా ప్రజెంట్ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు.
కానీ ఆయన గత మూడు చిత్రాల హీరోలను కండలతో చూపించాడు. బాహుబలి సిరీస్ కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో తెలిసిందే. ఆయన హల్క్ బాడీ సాధించడం కోసం గంటల తరబడి జిమ్ చేశాడు. అలాగే విలన్ గా చేసిన రానాను కూడా భారీకాయుడిగా చూపించారు. ఆర్ ఆర్ ఆర్ హీరోల విషయంలో కూడా ఆయన ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాల కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ ల శరీరాలు ఉక్కులా మార్చారు. కాబట్టి మహేష్ ని కండల వీరుడిగా చూపిస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి.

గతంలో మహేష్ ట్రై చేయని లుక్ కాబట్టి… చాలా స్పెషల్ అవుతుంది. ఇక ఈ చిత్రం బడ్జెట్ రాజమౌళి రూ. 1000 కోట్లుగా నిర్ణయించారట. హాలీవుడ్ సాంకేతిక వర్గం పనిచేయనుందట. రాజమౌళి తన గత చిత్రాలకు మించి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించనున్నారట. క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ చిత్ర షూట్లో పాల్గొంటున్నారు. లేటెస్ట్ షెడ్యూల్ కోసం భారీ ఇంటి సెట్ వేశారు. అక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.