New Super Earth : ఈ సృష్టికి అంతం లేదు. అంతులేని విశ్వంలో కేవలం మనం మాత్రమే ఉన్నామనుకోవడం పొరపాటే. సూర్యుడు అనే చిన్న నక్షత్రం చుట్టూ ఉన్న నవగ్రహాలు మాత్రమే విశ్వం కాదు.. ఇంకా చాలా సుదూర విశ్వాలు.. సూర్యుడిలాంటి నక్షత్రాలు.. భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి. వాటిని కనుక్కునే పనిలోనే శాస్త్రవేత్తలు ఎప్పుడూ పరిశోధిస్తుంటారు.

తాజాగా భూమి లాంటి మరో అత్యంత పెద్దదైన ‘మహాభూమి’ని కెనడా ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.మన సౌర వ్యవస్థకు ఆవల కనిపించిన ఈ మహాభూమి.. మన భూగ్రహం కంటే కూడా 70శాతం పెద్దగా ఉంది. అంటే ఐదు రెట్లు పెద్దదన్న మాట.. దీనిపై లోతైన సముద్రాలు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం మొత్తం బరువులో 30శాతం వరకూ మహాసముద్రం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇంత పెద్దదైన గ్రహంపై సంవత్సరకాలం అంటే అక్కడ 11 రోజులు మాత్రమేనని చెబుతున్నారు. ఆ మహాగ్రహం తనకు దగ్గరలో ఉన్న రెండు సూర్యుళ్ల చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తిరగడానికి కేవలం 11 రోజులే తీసుకుంటుంది.
ఒక సూర్యుడి చుట్టూ తిరగడానికి 11 రోజులు పడుతుండగా.. మరో దాని చుట్టూ తిరిగేందుకు 1400 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మహాభూమికి టీవోఐ1452బి అని పేరు పెట్టారు. ఈ మహా భూ గ్రహంపై హైడ్రోజన్, హీలియంతో కూడిన రాతిగ్రహంగా ఉందని చెబుతున్నారు. దీనిపై వాతావరణం తక్కువగా ఉందని అంచనావేస్తున్నారు.

ఈ గ్రహం మనకు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనలాంటి భూమి మరొకటి విశ్వంలో ఉందని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆనందపడుతున్నారు. కానీ దాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఒక కాంతి సంవత్సరం దూరమే 9.50 లక్షల కోట్ల కిలోమీటర్లు. 100 కాంతి సంవత్సరాలంటే మనం చేరుకోవడం దాదాపు అసాధ్యంగా తేల్చారు. కానీ ఎక్కడో ఒక చోట మరో భూమి ఉందన్న వార్త అందరినీ సంతోషపరుస్తోంది. అక్కడ సముద్రం ఉండడంతో జీవం ఉందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.