Homeట్రెండింగ్ న్యూస్Leopard: వైరల్ వీడియో; చిరుత ఇలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా?

Leopard: వైరల్ వీడియో; చిరుత ఇలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా?

Leopard: మనుషులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, వీడియోల్లో అందంగా కనిపించేందుకు ముస్తాబవడం పరిపాటి. అదే దండకారణ్యంలో క్రూర మృగాలు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మీరెప్పుడైనా చూశారా? పోనీ పాపరాజ్జి లాగా వెంటపడినప్పటికీ మౌనంగా భరిస్తూ రకరకాల కోణాల్లో ఫోటోల్లో కనిపించేందుకు తాపత్రయ పడటం మీరు ఎప్పుడైనా గమనించారా? లేదూ అంటారా.. అయితే ఒకసారి మీరూ ఈ కథనం చదవండి.

మనలో చాలామందికి పులులు, సింహాలు, చిరుతలు వంటి గంభీరమైన మృగాలను, వాటి కదలికలను చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఇలాంటి భయంకరమైన మృగాలు కూడా తమ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తిస్తాయి. వింత వింతగా కనిపిస్తూ అలరిస్తాయి. ఇటీవల కాలంలో హైదరాబాదులోని రాజేంద్రనగర్ ప్రాంతంలో ఒక చిరుత పులి ఇళ్లల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత రకరకాల యాంగిల్స్ లో కెమెరాలకు చిక్కింది. అప్పట్లో ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలను హోరెత్తించాయి. ఇప్పుడు కూడా అలాంటి విధంగానే ఒక చిరుత పులి వీధిలో సంచరిస్తూ.. కెమెరాకు అద్భుతమైన భంగిమల్లో కనువిందు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..

ఇక మనలో చాలామందికి వన్యప్రాణులను చూడాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే అడవులు చాలావరకు విలుప్తమైపోవడంతో వాటిని చూడాలి అనుకుంటే జంతు ప్రదర్శనశాలకు లేదా యానిమల్ ప్లానెట్ లేదా డిస్కవరీ ఛానల్ మాత్రమే శరణ్యం. ఇక ప్రస్తుతం ప్రభుత్వాలు అడవులను అభివృద్ధి చేసిన నేపథ్యంలో సఫారీలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే వన్యప్రాణులకు సంబంధించిన ఆకర్షణీయమైన దృశ్యాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో వీటికి వచ్చే రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చిరుత పులి వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో క్లిప్ లో చిరుత పులి శాంతంగా, సౌమ్యంగా వీధిలో సంచరిస్తున్నట్టు కనిపిస్తోంది. చిరుత పులి నైనిటాల్ వీధుల్లో ఒక ప్రైవేట్ కాలేజీ సమీపంలో సాయంత్రం వేళ తీరికగా నడుచుకుంటూ వెళ్లడాన్ని కొందరు గమనించారు. ఇంకేముంది తమ స్మార్ట్ ఫోన్ లకు పని చెప్పారు. ఆ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే వాట్సప్ గ్రూపుల ద్వారా వచ్చిన ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ లోని అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “రాత్రి భోజనం చేసిన తర్వాత నైనిటాల్ నగరంలో నడక” అనే శీర్షిక ను రాస్కొచ్చారు. పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో లక్షల్లో వ్యూస్ దక్కించుకుంది.

చిరుత పులి తారు రోడ్డు మీద హుందాగా నడుస్తున్నట్టు ఈ వీడియోలో కనిపించింది. ఆ వీడియోలో అది చాలా వింతైన హావభావాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది. ముందుకు రెండు కాళ్లు పైకి లేపి వెనక రెండు కాళ్లపై కూర్చొని ఏదో పరీక్షిస్తున్నట్టు కనిపించింది. దానిని దూరం నుంచి చూస్తున్న వారికి ఒకవైపు భయం, మరోవైపు ఆశ్చర్యం కలిగాయి. ఈ దృశ్యాన్ని దానికి సమీపంలో ఉన్న కొంతమంది తమ కేమెరాల్లో బంధించారు. ఇక ఈ వీడియో పట్ల చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు.” చిరుతపురులు రెండు కాళ్ళపై శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేయడానికి తమ తోకను ఉపయోగిస్తాయో ఈ వీడియో చూపిస్తుంది” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. చిరుత వైఖరి, నిర్మలతత్వం చూడండి అంటూ మరొక నెటిజన్ రాసుకోచ్చాడు. ఇది రాబోయే గ్లోబల్ అవార్డు కోసం సిద్ధమవుతోంది . ఈ చిరుత పులి వేషంలో ఉన్న ఒక ప్రముఖుడిని గుర్తించండి అంటూ” ఇంకొక నెటిజన్ వ్యాఖ్యానించాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular