Homeజాతీయ వార్తలుKCR - Left Parties: కేసీఆర్‌ యూస్‌ అండ్‌ త్రో.. ఎర్రజెండా పార్టీలకు హ్యాండిస్తారా..!?

KCR – Left Parties: కేసీఆర్‌ యూస్‌ అండ్‌ త్రో.. ఎర్రజెండా పార్టీలకు హ్యాండిస్తారా..!?

KCR - Left Parties
KCR

KCR – Left Parties: తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ను మూడోసారి గెలిపించి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యూహచరన చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని పార్టీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్‌ ఆరు నెలల క్రితమే ప్రకటించారు. సిట్టింగులంతా అదే ధీమాతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక వేళ గులాబీ బాస్‌ పొత్తుల రాజకీయాలకు తెరలేపారు. ఉప ఎన్నికల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌ తోకపార్టీలు అని అవమానించిన వారినే చెంతకు చేరుకున్నారు.

ఓటమిని తృటిలో తప్పించుకుని..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వామపక్షాలకు మంచి పట్టు ఉంది. అయితే గెలిచేంత బలం లేకపోయినా.. ఓడించే దమ్ము మాత్రం వారికి ఉంది. దీనిని గుర్తించి మునుగోడు ఉప ఎన్నికల వేళ వామపక్ష పార్టీల మద్దతు కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అడిగిందే మహాభాగ్యం అన్నట్లు సీపీఐ, సీపీఎం నాయకులు ప్రగతిభవన్‌లో వాలిపోయారు. మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి వామపక్షాల మద్దతుతో చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా పదివేల మెజారిటీతో విజయం సాధించారు. కేసీఆర్‌ ఆశించిన లక్ష్యం నెరవేరింది. వామపక్షాలు కూడా ఈ ఎన్నికల ద్వారా తమ బలం నిరూపితమైందని భావిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తు కొనసాగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చెరో 2 సీట్లు అడగాలని, రెండు ఎమ్మెల్సీ సీట్లు అడగాలని భావిస్తున్నారు.

హ్యాండ్‌ ఇవ్వబోతున్న కేసీఆర్‌?
బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా తెర ముందుకు వచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇది కమ్యూనిస్టు పార్టీలను ఆందోళనకు గురి చేస్తోంది. కేసీఆర్‌ నట్టేట ముంచుతారా అని వారు అనుమానిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భేషరతుగా బీఆర్‌ఎస్‌కు కమ్యానిస్టులు మద్దతు ఇచ్చారు. తర్వాత కూడా తమ బంధం కలిసి ఉంటుందని ప్రకటించుకున్నారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఆపేశారు. అధికార పార్టీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు. పొత్తులో ఎక్కడెక్కడ పోటీ చేయాలో కూడా లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు హ్యాండ్‌ ఇస్తారా అన్న అనుమానం వారిని టెన్షన్‌ పెడుతోంది.

ఖమ్మం, నల్లగొండలోనే పట్టు..
కమ్యూనిస్టు పార్టీలకు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే కాస్త పట్టు ఉంది. కొందరు ముఖ్య నేతలు ఉన్న ఇతర జిల్లాల్లోని ఒకటిరెండు నియోజకవర్గాల్లోనూ కాస్త బలం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు సీట్లు కేటాయిస్తారా అన్నది చర్చనీయాంశంగానే మారింది. కనీసం రెండు పార్టీలకు కలిసి ఐదు స్థానాలైనా కల్పిస్తే.. సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ స్థానాలు ఖమ్మం, నల్లగొండ జిల్లాలోనే ఉంటాయి. కానీ, ఆ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌లోనే పోటీ అధికంగా ఉంది. ఈసమయంలో సీట్లు కేటాయించకపోతే పొత్తుల వల్ల ప్రయోజనం ఉండదు. కమ్యూనిస్టులు కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసమే పోరాడుతున్నారు. అయితే కేసీఆర్‌ మాత్రం సీట్లు కేటాయిస్తారన్న సూచనలు కనిపించడం లేదు.

KCR - Left Parties
KCR – Left Parties

వచ్చే ఎన్నికల్లోనూ వామపక్షాలను ‘యూస్‌’ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్‌ ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలిస్తామని ఆశ చూపాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగియగానే ‘త్రో’ చేయడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే కమ్యూనిస్టు పార్టీలు.. పొత్తును నమ్ముకుని నిండా మునిగిపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version