
Ramoji Rao- Jagan: రామోజీరావు విషయంలో జగన్ దూకుడు తగ్గడం లేదు. ఇంకా మరింత ముందుకు వెళ్తున్నాడు. ఇందులో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీరావు విషయంలో ఢిల్లీ పెద్దల ఒత్తిళ్ల మేరకు వెనుకడుగు వేశాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ది ప్రాంతీయ పార్టీ, ఆయన ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు. ఇప్పుడు ఆయనకు చెప్పేవాడు లేడు. చెప్పే ధైర్యం కూడా ఎవరు చేయకపోవచ్చు.. ఒకవేళ చెప్పినా కూడా జగన్ వినకపోవచ్చు.
ఇక నిన్న ఏపీ సిఐడి ఏ డి జి సంజయ్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి తెలుగు మీడియాను రానివ్వలేదు. కానీ యాదృచ్ఛికంగా సాక్షికి అనుమతి ఇచ్చారు. జాతీయ మీడియాను మాత్రమే లోపలికి రమ్మన్నారు. ఏపీ భవన్లో సుదీర్ఘగంగా సమావేశం నిర్వహించారు. మార్గదర్శి విషయంలో రామోజీరావు దాస్తున్న నిజాలను, విచారణలో వెలుగుచూసిన విషయాలను వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి తెలుగు మీడియా గగ్గోలు పెట్టింది. ముఖ్యంగా ఈనాడు శోకాలు పెట్టింది. కానీ ఇక్కడ ఏపీ సిఐడి లేవనెత్తిన ప్రశ్నలను తెలుగు మీడియా ప్రచురిస్తోందా? సీఐడీ చేస్తున్న విచారణను బయట ప్రపంచానికి చెబుతోందా? లేదు కదా! అలాంటప్పుడు విలేకరుల సమావేశానికి తెలుగు మీడియాను తెరవాల్సిన అవసరం ఏంటని ఏపీ సిఐడి వాదిస్తోంది. పైగా సిఐడి విభాగానికి మచ్చ తెచ్చేలా కథనాలు ప్రచురిస్తోందని చెబుతోంది. తెలుగు మీడియా ఎలాగూ రాయడం లేదు కాబట్టి తమ విచారణలో వెలుగు చూసిన విషయాలను జాతీయ మీడియాకు వెల్లడించాలని విలేకరుల సమావేశం నిర్వహించినట్టు సిఐడి అధికారులు అంటున్నారు.
కానీ ఈ సమావేశం వెనక జాతీయస్థాయిలో రామోజీరావు పరువు తీయాలని జగన్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి మీద ఈనాడు వ్యతిరేక కథనాలు రాస్తోంది. ఆమధ్య పట్టాభి అనే టిడిపి నాయకుడిని పోలీసులు అరెస్టు చేసినప్పుడు.. అతడిని దెబ్బలు కొట్టకున్నా కూడా కొట్టారని పాత ఫోటోలు వేసి వార్త ప్రచురించింది. దీంతో జగన్ పై ఈనాడు లక్ష్యం ఏమిటో స్పష్టమైంది. ఈ క్రమంలోనే జగన్ రామోజీరావు మార్గదర్శి పై నజర్ పెట్టాడు. ఆ చిట్ఫండ్ వ్యాపారంలో అవకతవకలను సిఐడి ద్వారా తవ్వడం మొదలుపెట్టాడు. అంతే కాదు మీడియా మొఘల్ గా పేరుపొందిన రామోజీరావు ను బయటకి లాగాడు. విచారణ కూడా చేశాడు. ఆయన పెద్ద కోడలు శైలజను కూడా విచారించేలా చేశాడు. మరోవైపు తెలంగాణ హైకోర్టు నుంచి కూడా చుక్కెదురు కావడంతో ఇప్పుడు రామోజీరావు ఎవరు కాపాతారో?!

ఏపీ సిఐడి చేస్తున్న విచారణను తప్పుదోవ పట్టించేలా తెలుగు మీడియా వార్తలు రాస్తున్న నేపథ్యంలో .. సీఐడీ అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్లో సమావేశం నిర్వహించారు. విచారణకు సంబంధించిన పలు విషయాలను జాతీయ మీడియాకు వెల్లడించారు. జాతీయ మీడియా కూడా ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో జగన్ పాచిక పారింది. దీంతో రామోజీరావు అసలు రంగు బయటి ప్రపంచానికి తెలిసింది.