Mythri Movie Makers: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి. ఈ సంఘటన పరిశ్రమను పెద్ద కుదుపుకు గురి చేసింది. డిసెంబర్ 12 ఉదయం నుండి 13 తెల్లవారుఝాము వరకు ఐటీ సోదాలు నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ కి సంబంధించిన 15 ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు. ఆఫీసులు, ఇళ్లపై రైడ్ జరిగింది. యలమంచిలి రవి, నవీన్ ఎర్నేని నివాసాల్లో ఆపరేషన్స్ నిర్వహించారు. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్, రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. సినిమా లావాదేవీలకు సంబంధించిన హార్డ్ డిస్క్ లు సీజ్ చేసినట్లు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పక్క రాష్ట్రాలకు చెందిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టాప్ స్టార్స్ తో వందల కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు తీస్తున్నారు. అరడజనుకు పైగా చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి అవసరమైన నిధులు ఎక్కడ నుండి సమకూరుతున్నాయి. సినిమాల బడ్జెట్ అంతా సక్రమ మార్గంలోనే వస్తుందా లేదా ఏమైనా అక్రమాలకు పాల్పడుతున్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు.
సోదాల్లో సేకరించిన సమాచారంపై విచారణ చేపట్టారు. అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు తమ బ్లాక్ మనీ, అక్రమ సంపాదన చిత్ర నిర్మాణం వైపు మరలిస్తున్నారనేది అధికారుల అనుమానంగా, వారికి అందించిన సమాచారంగా తెలుస్తుంది. ఐటీ, జిఎస్టీ దాడుల నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ భవిష్యత్ చిత్రాలపై ప్రభావం ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్, చరణ్ చిత్రాలు కష్టమే, ఆగిపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో ఎన్టీఆర్ 31 మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో భారీగా ఈ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారు. ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి కాగానే ఎన్టీఆర్ 31 ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు. ఈ లోపు ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ పూర్తి చేస్తారు. ఎన్టీఆర్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. రామ్ చరణ్ 16వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ సైతం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ రెండు బడా ప్రాజెక్ట్స్ ప్రమాదంలో పడ్డాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.