K. Viswanath Sirivennela: కే విశ్వనాథ్ టాప్ 5 మూవీస్ లో సిరివెన్నెల ఖచ్చితంగా ఉంటుంది. సంగీత ప్రియులను స్వరసాగరంలో ఓలలాడించిన సినిమా అది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రంతో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచయితగా పరిశ్రమకు పరిచమయ్యారు. సిరివెన్నెల చిత్రంలోని అన్ని పాటలు సీతారామశాస్త్రితో విశ్వనాథ్ రాయించారు. కెవి మహదేవన్ స్వరాలకు సీతారామశాస్త్రి సాహిత్యం తోడై అద్భుతమైన పాటలు రూపొందాయి. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన చిత్రాల్లో సిరివెన్నెల కూడా ఒకటి. 1986 జూన్ 5న సిరివెన్నెల చిత్రం విడుదలైంది.
సుహాసిని హీరోయిన్ కాగా బెంగాలీ నటుడు బెనర్జీ హీరోగా నటించారు. హీరో గుడ్డివాడైన సింగర్. హీరోయిన్ సంగీతం అంటే ప్రాణం ఇచ్చే మూగమ్మాయి. హీరోయిన్ ఒక గాయకుడిని అతనిలోని ప్రతిభను ప్రేమిస్తుంది. అది మాటల్లో చెప్పలేని మూగతనం. దూరం నుండి చూస్తూ అతని పాటలు వింటూ… మనసులో ఆరాధిస్తూ ఉంటుంది. సున్నితమైన భావోద్వేగాలతో సాగే సిరివెన్నెల గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు మరోసారి కళాత్మక చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రచయితగా సిరివెన్నెలకు ఎక్కడలేని పేరు వచ్చింది. సిరివెన్నెల ఆయన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది.
మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్, ఆసియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికలపై సిరివెన్నెల ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ పొంది నిర్మాతలకు లాభాలు పంచింది సిరివెన్నెల మూవీ. అయితే ఈ సినిమా విషయంలో కే విశ్వనాథ్ సంఘర్షణకు గురయ్యారట. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు ఈ కథ నచ్చలేదట. నచ్చకపోవడం కంటే కూడా ఆ పాత్రలకు ఆయన ఇచ్చిన ఫీచర్స్, క్యారెక్టరైజేషన్ డిస్టర్బ్ చేశాయట.
అసలు హీరో గుడ్డివాడు, హీరోయిన్ మూగ అమ్మాయి కావడమేంటి? వారిద్దరి మధ్య ప్రేమేంటి? ఈ కథ నా తలపుకు ఎందుకు వచ్చింది? దీన్ని నేను ఎలా ముగించాలి ? అనే మానసిక వేదనకు గురయ్యారట. సిరివెన్నెల చిత్రీకరణ సమయంలో కూడా కే.విశ్వనాథ్ మనసులో అనేక సందేహాలు, ఊహాగానాలు చక్కర్లు కొట్టాయట. కథలో ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్స్ ఆయన్ని అంతగా ఇబ్బంది పెట్టాయట. ఆ మానసిక సంఘర్షణ తట్టుకొని విశ్వనాథ్ మూవీ పూర్తి చేసి అపురూపమైన విజయం అందుకున్నారు. విశ్వనాథ్ రాసిన పాత్రలు కావడంతో జనాలు అంగీకరించారు. కారణం తెరపై ఆయన పాత్రలు అంత సహజంగా ఉంటాయి.