Most Beatiful Village : ‘ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్’ ట్యాగ్ కేరళ రాష్ట్రంలోని కొల్లెంగోడ్ గ్రామానికి శాపంగా మారింది. ఆ ట్వీట్ చూసిన వారు ఊరిని చూసేందుకు తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడికి వస్తున్న సందర్శకులు వ్యర్థాలను అక్కడి పచ్చని పొలాల్లో, ప్రకృతి ఒడిలో వదిలేస్తున్నారు. సీసాలను పడేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ మా ఊరికి రావొద్దని కోరుకునే పరిస్థితి నెలకొంది. మోస్ట్ బ్యూటీఫుల్ విలేజ్ కాస్తా ఇప్పుడు చెత్తా చెదారంతో నిండి ఆ బ్యూటీని కోల్పోతున్న పరిస్థితి నెలకొంది.

– ట్వీట్‌లో ఏముందంటే..
ఈ ట్వీట్ చేసింది ఎవరో కాదు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తుంటారు. ఆసక్తిగల అంశాలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. పేదలకు సాయం అందేలా.. టాలెంట్‌ను ఎంకరేజ్ చేశాలా మహీంద్రా పోస్టులు ఉంటాయి. ఇటీవల ఆయన ‘భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలలో ఒకటి’ అని కొల్లెంగోడ్ అని గురించి ట్యాగ్ చేశాడు. ఇకేముంది కొల్లెంగోడ్ అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

-సినిమాల షూటింగ్..
అందమైన కొల్లెంగోడ్ గ్రామం సినిమా షూటింగ్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటి వరకు 50కిపైగా సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను గ్రామంలో చిత్రీకరించారు. ఈ అందమైన ఊరు ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడడం, ఆయన ట్విట్టర్‌లో లొకేషన్స్ షేర్ చేయడం ఇప్పుడు ఆ ఊరికి శాపంగా మారింది. గ్రామం అందాలను సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు వరిపొలాలు, నదులు మరియు చెరువుల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసాలు పడేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.

-ధన్యవాదాలు, మళ్లీ రాకండి..
సందర్శకుల రాకతో ఊరిలో సందడి పెరిగింది. గ్రామం ప్రాచుర్యం పొందింది. కానీ ఇక్కడి వ్యర్థాలతో ఊరి పర్యావరణమే దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పర్యటనకు వచ్చి గ్రామాన్ని చూసి వెళ్లినవారు మళ్లీ రావొద్దు అని స్థానికులు కోరుకుంటున్నారు. ఈమేరకు ఓ రైతు గ్రామంలో బోర్డు కూడా ఏర్పాటు చేశాడు. ఆయనను చూసి గ్రామంలోని సందర్శన ప్రదేశాలన్నింటి వద్ద ‘ధన్యవాదాలు, దయచేసి మళ్లీ సందర్శించవద్దు’ అని బోర్డులు ఏర్పాటు చేశారు.

– సోషల్ మీడియాలో రీల్స్..
కొల్లెంగోడ్ గ్రామ సందర్శనకు వస్తున్న యువతీ యువకులు, ఇక్కడి లోకేషన్లలో రీల్స్ కూడా చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.కొన్ని రోజులుగా అనేక వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి. దీంతో సోషల్ మీడియా కూడా కొల్లెంగోడు అందాలను చూపించే ఫొటోలు, రీళ్లతో నిండిపోయింది. దీంతో కూడా సందర్శకుల రాక పెరుగుతోంది.
This beauty around us just left me speechless…My bucket list for travel in India now overflows…. https://t.co/WXunxChIKg
— anand mahindra (@anandmahindra) June 8, 2023