India vs New Zealand: న్యూజిలాండ్ జట్టు ఇలా ఆడుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్టే పెవిలియన్ చేరతారని ఎవరూ అనుకొని ఉండరు. కానీ హార్దిక్ పాండ్యా నేతత్వంలోని యువ భారత్ టీం అలా అనుకునేలా చేసింది. న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది.. మొదటి మ్యాచ్ ఓటమి నేర్పిన పాఠాన్ని, రెండో మ్యాచ్ నేర్పిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని…మూడో మ్యాచ్ లో ఎటువంటి లోపాలకు తలెత్తకుండా ఆడింది.. న్యూజిలాండ్ జట్టును 66 పరుగులకు కుప్పకూల్చి 2_1 తేడాతో టి20 కప్ సొంతం చేసుకుంది.. ఇప్పటికే భారత జట్టు న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే.

టి20 చరిత్రలోనే టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.. న్యూజిలాండ్ తో బుధవారం జరిగిన మూడో టి20 సమిష్టిగా రాణించి 168 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.. టి20 చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా టీం ఇండియా నయా చరిత్ర లిఖించింది.. ఈ గెలుపుతో మూ డు టీ20 ల సీరిస్ ను హార్దిక్ సేన 2_1 తేడాతో కైవసం చేసుకుంది.. మరో వైపు ఘోర పరాజయంతో న్యూజిలాండ్ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది.. ఓపెనర్ గిల్ (63 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 126 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు) అజేయ సెంచరీ తో చెల రేగి పోయాడు.. రాహుల్ (44), హార్దిక్ (30) మెరుపులు మెరిపించారు.. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్ నర్, సోదీ, డారిల్ మిచెల్ తల ఒక వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది.. డారిల్ (35), శాంట్నర్ (13) మినహా అంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు.. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4/16) చెలరేగాడు.. ఉమ్రాన్ మాలిక్ (2/9), అర్ష్ దీప్ సింగ్ (2/16), మావి( 2/12) వికెట్లు తీశారు..
235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ను భారత బౌలర్లు కోలుకోలేని దెబ్బ తీశారు.. తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లు చెలరేగడంతో ఫిన్ అలెన్(3), కాన్వే(1), మార్క్(0), ఫిలిప్స్(2), బ్రేస్ వెల్ (8) వరుసగా అవుట్ అయ్యారు.. దీంతో ఆ జట్టు పవర్ ప్లే లోనే ఐదు వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసింది.. ఈ స్థితిలో డారిల్, మిచెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా శివమ్ మావి దెబ్బతీశాడు. శాంట్నర్ ను క్యాచ్ అవుట్ చేసిన మావి… ఇష్ సోదిని డక్ ఔట్ గా పెవిలియన్ చేర్చాడు. ఫెర్గు సన్ (0), టిక్ నర్ (1) లను హార్దిక్ అవుట్ చేయడంతో న్యూజిలాండ్ చేతులెత్తేసింది.. అతి చెత్త ఓటమిని తన పేరిట లిఖించుకుంది.