India Population 2023: ఏ ఏటికి ఆ ఏడు ఇండియా ఈనుతోంది… ఆస్ట్రేలియా అంత జనాభానూ, అమెరికాలో డాలర్లు పండును. ఇండియాలో సంతానం పండును.. చిన్నప్పుడు చదువుకున్న ఈ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.. జనసంఖ్యలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా ను భారత్ దాటేసింది. చైనా జనసంఖ్యను ఇప్పటికే భారత్ అధిగమించేసిందని పలు అంతర్జాతీయ జన గణన సంస్థలు చెబుతున్నాయి. 2022 డిసెంబర్ చివరి నాటికి చైనా జనాభా 141.2 కోట్ల కంటే భారత జనాభా 141.7 కోట్లు అంటే 50 లక్షలు అధికంగా ఉన్నట్టు ఆ సంస్థలు వివరిస్తున్నాయి. అయితే ఈ సంస్థల అధికారిక వెబ్సైట్లో గణాంకాల ప్రకారం ప్రస్తుతానికి భారత జనాభా కన్నా జనాభా 20 లక్షలకు పైగానే ఎక్కువ ఉండటం గమనార్హం.. మరో రీసెర్చ్ సంస్థ మాక్రో ట్రెండ్స్ ప్రకారం అయితే భారత జనాభా 142.8 కోట్లు. అయితే చైనా దశాబ్దాలుగా అనుసరిస్తున్న జనాభా నియంత్రణ తీరు ప్రకారమైతే ఆ సంఖ్యను భారత్ అధిగమించేందుకు ఎక్కువ కాలం పట్టబోదు.. మనదేశ జనాభాలో సగం 30 ఏళ్లలోపు వారే.. కాబట్టి దేశంలో రానున్న రోజుల్లో జన సంఖ్య వేగంగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ.. ఒకవేళ ప్రజలు కుటుంబ నియంత్రణ పాటించినప్పటికీ వచ్చే రోజుల్లో జన సంఖ్య వేగంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ.. ఆ లెక్కన 2050 నాటికి జనాభా పెరుగుతూనే ఉంటుంది. అప్పటికి మన జనాభా 166.8 కోట్లకు చేరుకుంటుంది.

భారతీయుల సగటు జీవితకాలం 2020 నాటికి 70.1 ఏళ్ళుగా ఉంది. 1950లో ఇది కేవలం 41.7 ఏళ్ళుగా ఉండేది. చైనాలో 1950 నాటికి 43.7 ఏళ్లుగా ఉన్న సగటు జీవితకాలం 2020 నాటికి 78.1 ఏళ్లకు చేరింది. 2011 ముందు మన దేశ జనాభా ఏటా సగటున 1.7 శాతం మేర పెరిగేది.. 2011 నుంచి ఆ సంఖ్య 1.2 శాతానికి తగ్గింది.. అదే సమయంలో చైనాలో జనాభా వార్షిక సగటు వృద్ధిరేటు -0.6 శాతానికి పడిపోయింది. అక్కడ పుట్టే వారి కంటే మరణించే వారి సంఖ్య ఎక్కువైంది.
మనదేశంలో అలా ఉంటే చైనాలో ఏటికి ఏడు జనాభా తగ్గుతూ వస్తోంది. 2021 తో పోలిస్తే 2022లో ఆ దేశ జనాభా 8.5 లక్షలు మేర తగ్గిందని ఆ దేశ జాతీయ గణాంకాల బ్యూరో వెల్లడించింది. అది తెలిపిన వివరాల ప్రకారం 2022 ముగిసే నాటికి ఆ దేశ జనాభా 141.18 కోట్లు. 2021లో ఆ సంఖ్య 141.26 కోట్లుగా ఉండేది. 1960 ల తర్వాత చైనాలో జనాభా తగ్గడం ఇదే మొదటిసారి.. 1976 తర్వాత 2022 లోఆ దేశంలో మరణాల రేటు కూడా అత్యధికంగా నమోదయింది. దేశ జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం 1979లో తొలిసారి ఒకే సంతానం విధానాన్ని అమలులోకి తెచ్చింది.. దానివల్ల చైనాలో కాలక్రమంలో ఆడ శిశువుల సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది.. స్కానింగ్ లో ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయించుకునే వారి సంఖ్య పెరిగింది.

జనాభాలో వృద్ధుల సంఖ్య కూడా పెరిగిపోవడం మొదలైంది.. యువత సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అప్రమత్తమైన చైనా సర్కారు ఇద్దరు పిల్లలను కనండి అంటూ ప్రజలను ప్రోత్సహించడం ప్రారంభించింది. 2021 నాటికి ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతి కూడా ఇచ్చింది. చైనా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ 2050 నాటికి ఆదేశ జనాభా దాదాపుగా 131.7 కోట్లు దాకానే ఉంటుందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనా వేసింది.