
Sleeping Tips: మనకు ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఆరోగ్యం కోసం మనకు నిద్ర చాలా ముఖ్యం. అందుకే రోజుకు కనీసం 6-8 గంటల పాటు నిద్ర పోతేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. లేదంటే ఏదో వ్యాధి బారిన పడినట్లే. నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన, తినే ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువగా టీవీ, కంప్యూటర్లు, ఫోన్లు చూడటం వంటి వాటితో మనకు నిద్ర సరిగా పట్టదు. దీంతో అనారోగ్యం దరిచేరుతుంది. పలు రోగాలకు దగ్గరవుతాం.
నిద్ర లేకపోతే తలెత్తే సమస్యలు
మనం రోజంతా సరిగా నిద్ర పోకపోతే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో తలనొప్పి, అల్జీమర్స్, మతిమరుపు, చికాకు, కోపం, నీరసం వంటి సమస్యలు ఎదుర్కొంటాం. అందుకే సరైన సమయంలో సరైన విధంగా నిద్ర పోయేందుకు తగిన పరిస్థితులు కల్పించుకోవాలి. నిద్ర పోవడానికే మొగ్గు చూపాలి. లేకపోతే ఇబ్బందులు రావడం సహజం. నిద్రలేమి సమస్యను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి రోజు కచ్చితంగా సమయం ప్రకారం నిద్రపోతేనే మనకు మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
మనకు సరైన నిద్ర రాకపోతే సమస్యలు వస్తాయి. అందుకే మనం పడుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం నిద్రించే గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. వెలుతురు ఉంటే మన మెదడు డియాక్టివేట్ అయి నిద్ర తొందరగా రాదు. నిద్రించే సమయంలో తల కింద దిండు, బెడ్ శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. దుస్తులు బిగుతుగా కాకుండా వదులుగా ఉండాలి. రాత్రి సమయంలో సులువుగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందే ఆహారం తీసుకోవడం ఉత్తమం. నిద్రించే గది శుభ్రంగా ఉండేలా చూసుకుంటే మంచిది.

ఏ చిట్కాలు ఉపయోగించాలి
పడుకునే ముందు గోరువెచ్చని పాలు తీసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, చిటికెడు జాజికాయ పొడి, చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. వీటిని పాటిస్తే సుఖమైన నిద్ర పడుతుంది. నిద్ర లేమి సమస్య నుంచి మనకు ఉపశమనం లభించడం ఖాయం. ఇలా మంచి నిద్ర పట్టేందుకు ఇలాంటి వాటిని పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.