
Nizam With Smitha- Chiranjeevi: చిరంజీవి ‘నిజం విత్ స్మిత’ టాక్ షోలో పాల్గొనగా అనేక విషయాలు చర్చకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గురించి హోస్ట్ స్మిత ప్రత్యేకంగా కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ… పవన్ ఇంట్లో రామ్ చరణ్, సుస్మితలను ఆడిస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుండి గన్స్ అంటే ఇష్టం. ఏదైనా షూటింగ్ లొకేషన్ కి వెళుతుంటే… నీకు ఏం కావాలంటే, అక్కడ గన్స్ దొరుకుతాయి తీసుకురా అన్నయ్య అని అడిగేవాడు. అవి డమ్మీ గన్సే, సెమీ ఆటోమేటెడ్ గన్స్ ఏం కాదు తీసుకొచ్చేయ్ అనేవాడు. ఒకరోజు గన్ తో రైల్వే స్టేషన్ లో కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. అది డమ్మీ గన్ అని తెలిసి వదిలేశారు.
ఇలా గన్స్ పట్టుకు తిరుగుతుంటే నక్సల్స్ లో కలిసిపోతాడేమోనని భయమేసింది. పవన్ మీకు హీరోగా ఇష్టమా? లేక రాజకీయ నాయకుడిగా ఇష్టమా? అని అడగ్గా.. పవన్ చిన్నప్పటి నుండి బాధలకు స్పందించే తీరు, సహాయం చేయాలనే తత్త్వం కలిగి ఉండేవాడు. ఆ గుణాలు చూసి ఏదో ఒకరోజు రాజకీయ నాయకుడు అవుతాడనే నమ్మకం కలిగింది. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ అదో రకం. వాళ్లను ఫ్యాన్స్ అనకూడదు. వారు కల్ట్ భక్తులు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా కంటే కూడా రాజకీయ నాయకుడిగా ఉండటం అవసరం అని చిరంజీవి అన్నారు.
పవన్ కళ్యాణ్ అత్యున్నత పదవి అధిరోహిస్తే… ప్రజలకు మంచి జరుగుతుంది. అతడు సీఎం కావాలని ఏపీ ప్రజలు ఏదో ఒకరు రోజు కోరుకుంటారని చిరంజీవి మద్దతు తెలిపారు. ఇటీవల పలు సందర్భాల్లో చిరంజీవి తన పూర్తి మద్దతు జనసేన పార్టీకి తెలిపారు. నేను జనసేన పార్టీలో చేరకపోతేనే పవన్ కి మంచి జరుగుతుందని చిరంజీవి ఇటీవల అన్నారు. బయట నుండి నా మద్దతు ఆ పార్టీకి ఉంటుందని ఆయన వెల్లడించారు.

అన్నయ్య చిరంజీవి కోరుకున్నట్లు రాజకీయంగా అత్యున్నత స్థాయికి వెళ్లాలని ప్రతి ఒక జన సైనికుడు కోరుకుంటున్నాడు. ఇక నిజం విత్ స్మిత షోలో చిరంజీవి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటుడిగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు, మానసిక క్షోభ ఎదుర్కొన్నట్లు చెప్పారు.రాజకీయ నాయకుడిగా ప్రచారం చేస్తుంటే పూలతో ఆహ్వానం పలికిన కాసేపటికి గుడ్లలో కొట్టారని చెప్పుకొచ్చారు. ఒక స్థాయికి వచ్చా ప్రశంసలు, విమర్శలు రెండూ ఉంటాయి. వాటిని తీసుకోగలగాలని చిరంజీవి అన్నారు.