Homeట్రెండింగ్ న్యూస్Oxford Economics- Hyderabad: బీజింగ్, టోక్యోలను మించి.. మన హైదరాబాద్‌ దూసుకెళుతోంది!

Oxford Economics- Hyderabad: బీజింగ్, టోక్యోలను మించి.. మన హైదరాబాద్‌ దూసుకెళుతోంది!

Oxford Economics- Hyderabad: ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్న ప్రస్తుత సమయంలోనూ ఆర్థి వృద్ధిలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. 2023 సంవత్సరంలో ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని మహామహా నగరాలన్నింటినీ వెనుకకు నెట్టి ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుందని ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌’ తన తాజా నివేదికలో ప్రకటించింది. ఇప్పటికే ఆర్థికంగా గొప్పగా వ్యవస్థీకృతమైన షాంఘై, టోక్యో, సింగపూర్‌ వంటి నగరాలను కూడా హైదరాబాద్‌ వెనక్కు నెట్టనున్నదని తెలిపింది. హైదరాబాద్‌ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌వైపు చూస్తున్నాయి. వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సిటీ కేరాఫ్‌గా మారుతోంది. ఐటీ ఎగుమతుల్లోల జాతీయ సగటుకన్నా హైదరాబాద్‌ 3 శాతం అధికంగా ఎగుమతి చేస్తోంది. ఆఫీస్‌ స్పేస్‌లోనూ మనదే అగ్రస్థానం.

Oxford Economics- Hyderabad
Oxford Economics- Hyderabad

మాంద్యం గుప్పిట్లో ప్రపంచం
ప్రపంచం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నదని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా వంటి కారణాలతో అమెరికా వంటి అగ్రదేశాలు కూడా ఆర్థికంగా కుదేలవుతున్నాయి. 2022 చివరలో మొదలైన ఈ పరిస్థితి 2023లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

తాజా నివేదికలో మనమే తోపు..
ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ లోని ప్రధాన నగరాల్లో మౌలిక వసతులు, 2022లో ఆర్థిక వృద్ధి, స్థానిక పరిస్థితులు, రాబడుతున్న జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు, వివిధ రంగాల్లో సాధిస్తున్న వృద్ధి రేటుతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు పలు రంగాల్లో నిర్వహించిన సర్వేలను ప్రామాణికంగా తీసుకొని 2023లో నగరాల ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుందనే అంచనాలను రూపొందించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు వెన్నెముక వంటి షాంఘై, బీజింగ్‌ నగరాలతోపాటు ఆసియాలో అతిపెద్ద నగరాలైన టోక్యో, హాంకాంగ్, సింగపూర్, బ్యాంకాక్‌ కూడా 2023లో ఆర్థిక మాంద్యం బారిన పడనున్నాయని తెలిపింది.

వృద్ధిలో.. తగ్గేదే లే
ఆర్థికంగా కొమ్ములు తిరిగిన నగరాలు కూడా మాంద్యం దెబ్బకు కుదేలవుతుండగా, హైదరాబాద్‌ మాత్రం వృద్ధిలో తగ్గేదేలే అంటోంది ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ ఆసియా పసిఫిక్‌ రీజినల్‌ అవుట్‌లుక్‌ నివేదిక ప్రకారం హైదరాబాద్‌ నగరం 2023లో 6 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదుచేయనున్నది. బెంగళూరు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేయనున్నది. చైనా నగరాలు కొవిడ్‌–19తో విలవిలలాడుతున్న దరిమిలా 2023లో అవి ఆర్థికంగా కోలుకొనే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. బ్యాంకాక్‌ నగరం పర్యాటక రంగంలో కొంతమేర కోలుకొనే అవకాశమున్నదని తెలిపింది.

పెట్టుబడులే ఆయువుపట్టు..
హైదరాబాద్‌ మహానగరం ఈ ఏడాది అనూహ్య ఆర్థిక వృద్ధి సాధించటానికి కొన్ని సంవత్సరాలుగా నిలకడగా వస్తున్న జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే కారణంగా నిలుస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. గతంలో దేశీయ దిగ్గజ ఐటీ, ఐటీఎస్‌ కంపెనీలు బెంగళూరు వైపు మాత్రమే చూసేవి. ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌ నగరం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. పెట్టుబడుల ఆకర్షణకు ఇక్కడ వాతావరణ అనుకూలత ఒక కారణమైతే, తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో వేల కోట్లు వెచ్చించి సమకూరుస్తున్న రహదారులు, ఫ్లైఓవర్లు, మంచినీరు, పార్కులు, 24 గంటల విద్యుత్తు సరఫరా తదితర మౌలిక వసతులు మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

Oxford Economics- Hyderabad
Oxford Economics- Hyderabad

 హైదరాబాద్‌ బాటలో.. దిగ్గజ కంపెనీలు
ప్రపంచ ఐటీ దిగ్గజాలైన మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్‌ కంపెనీలు తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి. వీటితోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు తమ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లను సైతం ఇక్కడే ప్రారంభించాయి. వచ్చే రెండుమూడేండ్లలో డాటా సెంటర్ల ఏర్పాటుకోసం సుమారు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ ప్రకటించాయి. డాటా సెంటర్ల ఏర్పాటుకు మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ లెక్కన డాటా సెంటర్ల విభాగంలోనే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రస్తుతం అమెజాన్, మెక్రోసాప్ట్, కంట్రోల్‌ ఎస్‌ డాటా సెంటర్ల నిర్మాణం పురోగతిలో ఉన్నది. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపుతుండగా, కొత్తగా మరిన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఎగుమతులు రూ.రెండు లక్షల కోట్లు
ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది దేశవ్యాప్తంగా 17.20 శాతం వృద్ధి రేటు ఉంటే, తెలంగాణలో 26.14 శాతం నమోదైంది. 2022–23లోనూ ఐటీ రంగంలో 17 నుంచి 20 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉన్నదని అంచనా. దాని ప్రకారం 2022–2023లో హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం లో బెంగళూరును హైదరాబాద్‌ ఎప్పుడో దాటేసింది. కొత్త ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగానే ఏర్పాటు కావడంతో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular